కాశీ విశ్వనాథ్ కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా అన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు? అవును, ఆయన నటుడిగా చేయక ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా అనేక సినిమాలకు వర్క్ చేసారు. అలా సుమారు 25 లకు అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ దర్శకుడు, కో డైరెక్టరుగా పనిచేశాడు. ఆయన అలా చేసిన సినిమాల విషయానికొస్తే... ప్రేమించుకుందాం రా, గణేష్, కలిసుందాం రా.. లకు కో డైరెక్టర్ గా వర్క్ చేసారు. చాలా మంది దర్శకుల దగ్గర పని చేసిన అనుభవం ఉంది ఆయనకు.. అంతే కాదు కాశీ విశ్వనాథ్ దర్శకుడిగా తన ప్రతిభను కూడా చాటుకున్నారు. టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ఆ మూవీ మరేదో కాదు నువ్వులేక నేను లేను. అప్పటిలో ఈ సినిమా సెన్సేషనల్ హిట్.
2002లో విడుదలైన నువ్వు లేక నేను లేను భారీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో అప్పటి లవర్ బాయ్ తరుణ్ హీరోగా నటించగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా చేసి మెప్పించారు. అలాగే ఇందులో లయ సెకండ్ హీరోయిన్ గా మెరిసింది. ఈ అందమైన ప్రేమ కథకు వై. కాశీ విశ్వనాథ్ దర్శకత్వం వహించగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు సారథ్యంలో, డి. రామానాయుడు నిర్మించారు. ఈ మూవీలోని పాటలు అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఆర్పీ పట్నాయక్ దీనికి సంగీతం అందించారు. ఈ తర్వాత తొలి చూపులో అనే సినిమాకు కూడా విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. కానీ ఆ తర్వాత ఆయన దర్శకత్వం వైపు వెళ్ళకుండా కేవలం నటుడిగా మాత్రమే కొనసాగుతూ వస్తున్నారు.