స్టార్ హీరోయిన్ త్రిష చేస్తున్న తొలి వెబ్ సిరీస్ బృంద టీజర్ వచ్చింది. ఇంట్రెస్టింగ్‍గా సాగింది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీ కూడా ఖరారైంది.స్టార్ హీరోయిన్ త్రిష.. ఓటీటీల్లోకి అడుగుపెడుతున్నారు. తన తొలి ఓటీటీ ప్రాజెక్ట్‌గా ‘బృంద’ వెబ్ సిరీస్ చేస్తున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సిరీస్‍లో పోలీస్ ఆఫీసర్‌ బృందగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు త్రిష. ఆమెకు ఇదే తొలి వెబ్ సిరీస్‍గా ఉంది. దీంతో బృందపై ఆసక్తి నెలకొంది. సంవత్సరంగా ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు రెడీ అయింది. జూలై 8 బృంద సిరీస్ టీజర్ రిలీజ్ కాగా.. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.బృంద టీజర్ ఆసక్తికరంగా ఉంది. మూఢనమ్మకాలు, వరుస హత్యలు, ఇన్వెస్టిగేషన్ అంశాలతో టీజర్ ఉంది. ఎమోషనల్‍గానూ సాగింది. మిస్టరీతో కూడిన కేసును పోలీస్ ఆఫీసర్ బృంద (త్రిష) దర్యాప్తు చేయనున్నారని అర్థమవుతోంది. ఈ కేసుతో వ్యక్తిగతంగానూ ఆమెకు సంబంధం ఉంటుందనేలా టీజర్లో మేకర్స్ హింట్ ఇచ్చారు.ఓ బాలికను ఓ పెద్ద రాయికి కట్టేసి ముఖానికి పసుపు, కుంకమ రాసి.. ఏదో ద్రవం పోస్తున్న సీన్‍తో బృంద టీజర్ మొదలైంది. “మనలో ఉన్న కోపం, మోసం, ద్వేషం వీటితో కాదు మనం పోరాడాల్సింది. మనలో ఉన్న మంచితో. అది మనలో నుంచి పోకుండా” అనే వాయిస్ ఓవర్‌లో బ్యాక్ గ్రౌండ్‍లో నడుస్తుండగా ఈ టీజర్ షురూ అయింది. ఆ తర్వాత వరుస హత్యలు జరిగినట్టు చూపించారు మేకర్స్. ఆ తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న షాట్స్ ఉన్నాయి. గన్ పేల్చే షాట్‍తో టీజర్ ముగిసింది. ఒక నిమిషం 28 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది.

బృంద వెబ్ సిరీస్‍కు సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించారు. కథ కూడా అతడిదే. స్టార్ డైరెక్టర్లు శేఖర్ కమ్ముల, హను రాఘవపూడి దగ్గర మనోజ్ అసిసెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. బృంద సిరీస్‍లో త్రిష, ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించగా.. జయ ప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి కీలకపాత్రలు చేశారు.బృంద వెబ్ సిరీస్ ఆగస్టు 2వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. . తెలుగులోనే ఈ సిరీస్ రూపొందింది. మరిన్ని ముఖ్యమైన భాషల్లోనూ వస్తుందని పేర్కొంది. “థ్రిల్లర్ ఫ్యాన్స్..సిద్ధంగా ఉండండి. కొత్త సిరీస్‍తో త్రిష తన ఓటీటీ డెబ్యూట్‍తో వస్తున్నారు. ఆగస్టు 2న బృంద స్ట్రీమింగ్‍కు రానుంది” అని సోనీ లివ్ నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.బృంద వెబ్ సిరీస్‍ను యాడింగ్ అడ్వర్టైజింగ్ పతాకంపై కొల్ల ఆశిష్ నిర్మించారు. ఈ సిరీస్‍కు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. దినేశ్ కే బాబు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. తెలుగు డైలాగ్‍లను జే కృష్ణ రాశారు.సినిమాల విషయానికి వస్తే.. త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. తమిళ స్టార్ అజిత్‍తో విదా ముయర్చిలోనూ హీరోయిన్‍గా చేస్తున్నారు. కమల్ హాసన్ మూవీ థగ్ లైఫ్‍లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. రెండు మలయాళం సినిమాలు కూడా త్రిష లైనప్‍లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: