డిసెంబర్ లో విడుదలకావలసి ఉన్న ‘పుష్ప 2’ ప్రకటించిన తేదీకి విడుదల అవుతుందో లేదో తెలియని పరిస్థితి అని అంటున్నారు. ఈసినిమా క్లైమాక్స్ విషయంలో సుకుమార్ కు అల్లు అర్జున్ కు భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయని గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇక శంకర్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో దిల్ రాజ్ నిర్మిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితి మరింత కన్ఫ్యూజన్ గా ఉంది అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.
ఈసినిమాకు సంబంధించిన పెండింగ్ షూటింగ్ ఇంకా 20 రోజులు పైగా బ్యాలెన్స్ ఉందని ‘భారతీయుడు 2’ షాక్ నుండి శంకర్ త్వరగా తేలుకుని ‘గేమ్ ఛేంజర్’ పై దృష్టి పెట్టినప్పటికీ ఈమూవీ కనీసం డిసెంబర్ లో అయినా విడుదల అవుతుందా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో భారీ అంచనాలు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘దేవర’ మూవీ తప్ప ఈ సంవత్సరం టాప్ హీరోల నుండి మరొక సినిమా వచ్చే ఆస్కారం లేదా అన్నసందేహాలు సగటు సినిమా అభిమానులలో కలుగుతున్నాయి.
వాస్తవానికి ‘దేవర’ సెప్టెంబర్ చివరిలో విడుదల కావలసి ఉంది. జూలై నెల సగం పైన గడిచిపోవడంతో ఇక ‘దేవర’ ప్రమోషన్ కు రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ ఈమూవీ ప్రమోషన్ విషయంలో ఈమూవీ నిర్మాతలు ఎందుకు పట్టించుకోవడంలేదు అంటూ తారక్ అభిమానులు భావిస్తూ ‘దేవర’ కూడ తన రిలీజ్ డేట్ ను మళ్ళీ మరొకసారి మార్చుకుంటుందా అంటూ తారక్ అభిమానులు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.
దీనికితోడు ఈసినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న అనిరుధ్ ‘భారతీయుడు 2’ కు అందించిన పాటల ట్యూన్స్ ఏమాత్రం బాగుండకపోవడంతో చరణ్ అభిమానులు విపరీతంగా ఖంగారు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ‘దేవర’ షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే తారక్ తన బాలీవుడ్ సినిమాను మొదలు పెట్టడంతో కొరటాల ‘దేవర’ మూవీ మరింత ఆలస్యం అవుతుందా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు..