కేరళలో టాలీవుడ్ హీరోలు ఎవరికీ లేనంత భారీ మార్కెట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి మాత్రమే ఉంది. పుష్ప సినిమాతో నార్త్‌లో కూడా తన క్రేజ్ చూపించిన బన్నీకి ఎప్పటి నుంచో కేరళలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది. బన్నీకి తెలుగులో ఫ్లాప్ అయిన పలు సినిమాలు కేరళలో భారీ వసూళ్లు రాబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మాలీవుడ్ ఫ్యాన్స్ అందుకే బన్నీని 'మల్లు అర్జున్' అని కూడా పిలుస్తుంటారు. అలాంటి కేరళ ప్రస్తుతం వరదలతో అల్లాడుతున్నందున తన వంతు సాయం ప్రకటించారు అల్లు అర్జున్.ఇకపోతే.. దేశ ప్రజలకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుంటుందన్న సంగతి తెలిసిందే. విపత్తులొచ్చినప్పుడు తొలుత స్పందించేది సినీనటులే. తమను ఇంతటివారిని చేసిన సమాజం కష్టంలో ఉన్నప్పుడు తమ వంతు సాయం చేస్తారు. తాజా కేరళ విపత్తుపైన సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు సినిమా వేడుకలు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లుగా మలయాళ చిత్ర పరిశ్రమ ప్రకటించింది. మల్లూవుడ్‌తో పాటు దక్షిణాది ఇండస్ట్రీ మొత్తం వయనాడ్ బాధితులకు అండగా నిలిచింది. మోహన్ లాల్ స్వయంగా ఆర్మీ దుస్తుల్లో ఘటనాస్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొనగా.. పలువురు నటీనటులు తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు.ఈ జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ చేరారు. వయనాడ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన సహాయ పునరావాస కార్యక్రమాల కోసం తన వంతుగాసహాయం అందించారు.కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ జిల్లాలో పునరావాస ప్రయత్నాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMDRF)కి విరాళం అందించిన తాజా సినీ ప్రముఖుడు అల్లు అర్జున్. జులై 30 తెల్లవారుజామున జిల్లాలో సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 219కి చేరినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎక్స్‌ పోస్ట్‌లో అల్లు అర్జున్ తనకు ఎప్పుడూ చాలా ప్రేమను ఇచ్చే రాష్ట్రం కోసం.. ఈ కష్ట సమయంలో తన వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.''వాయనాడ్‌లో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటం వల్ల నేను చాలా బాధపడ్డాను. కేరళ ఎప్పుడూ నాకు చాలా ప్రేమను ఇస్తోంది. పునరావాస కార్యక్రమాలకు మద్దతుగా కేరళ సిఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం ద్వారా నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. మీ భద్రత కోసం ప్రార్థిస్తున్నాను'' అని ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: