తెలుగు వారి సోగ్గాడు.. శోభ‌న్‌బాబు సినిమాల‌కు ప్ర‌త్యేక‌త‌లు ఉంటాయి. ఆయ‌న ఏదైనా కూడా.. మొహం మీదే అడిగేస్తారు. షూటింగ్ నుంచి ఎడిటింగ్ వ‌ర‌కు.. ఆయ‌న జాగ్ర‌త్త‌లు తీసుకునేవారు. డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌కు, పాట‌ల‌కు స‌సేమిరా అనేవారు. అంతేకాదు.. ఆయ‌న త‌న సినిమాకు సంబంధించిన డైలాగులు అన్నీ.. తొలి రోజే తీసుకునేవారు. వాటిలో అవ‌స‌రం అనుకుంటే..త న అభిమానుల కోసం మార్పులు చేర్పులు  త‌నే చేసేవారు.


దీంతో ఏద‌ర్శ‌కుడైనా... శోభ‌న్‌బాబుతో సినిమా చేయాల‌ని అనుకుంటే.. ముందుగానే ఆయ‌న పాత్ర‌కు సంబంధించి అన్ని డైలాగులు రాయించేవారు. దీనిని ఆయ‌న‌కు పంపించేవారు. షెడ్యూల్ ప్ర‌కారం వాటిని శోభ‌న్‌బాబు బైహార్ట్ చేసేవారు. అయితే...అగ్ర‌ద‌ర్శ‌కుడు బాపు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సంపూర్ణ రామాయణం సినిమాలో శోభ‌న్‌బాబును రాముడి పాత్ర‌కు తీసుకున్నారు. దీనికి అనేక కండిష‌న్లు పెట్టిన శోభ‌న్‌బాబు ఎట్ట‌కేల‌కు బాపుతో చేసిన సినిమా ఇదే.


అయితే.. పైన చెప్పుకొన్న‌ట్టుగానే.. తొలిరోజే.. ఈ సినిమాకు సంబంధించిన డైలాగులు ఇవ్వాల‌ని.. శోభ‌న్ బాబు త‌న అసిస్టెంట్‌ను ఈ సినిమా ర‌చ‌యిత ముళ్ల‌పూడి వెంక‌ట‌ర‌మ‌ణ ఆఫీస్‌కు పంపించారు.  ఇక‌, శోభ‌న్ విష‌యం తెలిసిన బాపు, ర‌మ‌ణ‌లు.. ముందుగానే రాముడి పాత్ర డైలాగుల‌ను రాసేశారు. దీనిని అసిస్టెంట్ చేతికి ఇచ్చి పంపించారు. అయితే.. ఏసినిమాకైనా.. 5 నుంచి 7 పేజీల వ‌ర‌కు డైలాగులు ఉండే హీరోకు.. ఈ సినిమాలో మాత్రం కేవ‌లం సింగిల్ పేజీ డైలాగులు ఉన్నాయి.


అది కూడా.. ప‌ట్టుమ‌ని 10 నుంచి 12 డైలాగులు మాత్ర‌మే. దీంతో శోభ‌న్‌బాబు.. అనుమానించారు. త‌న‌ను ఎక్క‌డో మైన‌స్ చేస్తున్నార‌ని భావించి ర‌మ‌ణ గారికి ఫోన్ చేశారు. ఇందేంటి ర‌వ‌ణ‌గారూ.. రంగారావుకు ఓ న్యాయం.. నాకోన్యాయ‌మా?  అని ప్ర‌శ్నించారు. ఎంద‌కంటే.. ఈ సినిమాలో రావ‌ణాసురిడిగా.. ఎస్వీ రంగారావు న‌టించారు. ఆయ‌న‌కు ప‌ది పేజీల‌వ‌ర‌కు డైలాగులు రాశారు.


కానీ, రాముడి వేష‌ధారి శోభ‌న్‌కు కేవ‌లం ఒక పేజీ అది కూడా ఒక‌వైపే రాసిపంపించారు. దీంతో శోభ‌న్‌కు స‌హ‌జంగానే కొపం వ‌చ్చింది. అయితే.. ర‌మ‌ణ‌గారు చెప్పిన ఒకే ఒక్క డైలాగుతో.. శోభ‌న్‌బాబు సైలెంట్ అయ్యారు. ``రాముడు మాట‌ల మ‌నిషి కాదండి. ఆయ‌న చేత‌ల మ‌నిషి. అందుకే ఆయ‌న పాత్ర‌కు డైలాగులు పెద్ద‌గా ఉండ‌వు`` అన్నారు ర‌మ‌ణ‌గారు. ఇదీ.. సంగ‌తి. ఈ సినిమా ఏకంగా 200 రోజులు ఆడడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: