టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు  సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన గతంలో నటించి సూపర్ డూపర్‌ హిట్‌ అయిన మురారి సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెల్సిందే.మురారి రీ రిలీజ్ కు సంబంధించిన హడావుడి థియేటర్ల వద్ద మాములుగా లేదనే చెప్పాలి. నేడు అంతా కూడా అదే సందడి కొనసాగుతుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు. ప్రతి థియేటర్‌ లో అభిమానులు చేస్తున్న సందడి తాలూకు వీడియో లు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి.అయితే అన్ని వీడియోలు ఒక ఎత్తు అయితే.. మురారి సినిమా చూస్తూ ఒక జంట ఏకంగా పెళ్లి చేసుకున్న వీడియో మరో ఎత్తుగా నిలిచింది.ఓ యువకుడు మురారి సినిమాలోని అలనాటి రామచంద్రుడు పాట వస్తున్న సమయంలో  యువతి మెడలో పసుపు తాడు కట్టాడు. అక్కడున్న వారు అంతా కూడా వారిని తలంబ్రాలతో ఆశీర్వదించడం జరిగింది. మురారి సినిమా అంటే ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌ కి ఏ స్థాయిలో ఇష్టమో అభిమానమో ఈ సంఘటనతో పూర్తిగా అర్థం అవుతుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తూ ఆ వీడియోను సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్స్ లో బాగా షేర్ చేస్తూ వైరల్‌ చేస్తూ మహేష్ బాబు స్టామినా ఏంటో చూపిస్తున్నారు.మురారి సినిమా నటుడిగా మహేష్ ని స్టార్ ల సరసన నిలిపింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ తనయుడు అంటూ అప్పటి వరకు ఉన్న గుర్తింపు నుంచి మహేష్ బాబు బయట పడటంలో ఆ సినిమా  సహాయపడింది. అందుకే మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా కాలంగా మురారి రీ రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు. 


బుల్లి తెరపై ఈ సినిమా వందల సార్లు వచ్చినా కూడా థియేటర్‌ లో చూస్తున్నప్పుడు ఆ ఫీల్‌ చాలా బాగుందని, థియేటర్ లో మళ్లీ మళ్లీ చూడాలని ఆశగా ఉందని కొంతమంది ఫ్యాన్స్ సినిమా చూసి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు.సీనియర్ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందిన మురారి సినిమాలో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే హీరోయిన్‌ గా నటించింది. సీనియర్ నటీ నటులు సత్యనారాయణ, గొల్లపూడి మారుతి రావు, లక్ష్మి, రవి బాబు ఇంకా ఎంతో మంది నటులు నటించారు. మణిశర్మ అందించిన సంగీతం అయితే సినిమా స్థాయిని రెట్టింపు చేసింది. ప్రతి పాట కూడా ఇప్పటికి మహేష్ బాబు అభిమానుల ఫోన్‌ లలో ఇంకా మారుమ్రోగుతూనే ఉంటుంది. 2001 ఫిబ్రవరి 17న విడుదలయిన మురారి సినిమా 23 సంవత్సరాల తర్వాత థియేటర్ లో వచ్చినా కూడా ఫ్యాన్స్ సందడి అయితే మామూలుగా లేదు. మరో పాతికేళ్ల తర్వాత వచ్చినా కూడా మురారి ఫ్రెష్ మూవీగానే ఉంటుందని, ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పటికి మురారిని గుండెల్లో పెట్టుకొని ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారని మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: