ఎటువంటి పండుగలు లేకపోయినా కేవలం వరసపెట్టి వస్తున్న సెలవులను నమ్ముకుని ఇన్ని భారీ సినిమాలు విడుదల చేస్తున్న నేపధ్యంలో ప్రేక్షకులు ఇన్ని సినిమాలను ఒకే వారంలో చూస్తారా అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. ఇన్ని భారీ సినిమాల మధ్య ఇప్పుడు ఒక చిన్న సినిమా పోటీ పడుతూ విడుదల అవ్వడం షాకింగ్ గా మారింది. ‘మ్యాడ్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె హీరోగా నటించిన ‘ఆయ్’ విడుదల అవ్వడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.
ఈమూవీ వెనుక గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ సపోర్ట్ ఉండటంతో ఈమూవీ పై ఉన్న నమ్మకంతో ప్రీమియర్ షోలను కూడ వేస్తున్నారు. సినిమా బాగుంటే అది చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా జనం ధియేటర్లకు వస్తున్న పరిస్థితులలో ఈసినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో ఈమూవీని విడుదల చేస్తున్నారు అని భావించినప్పటికీ ఇన్ని భారీ సినిమాల మధ్య ఈ చిన్న సినిమాకు చోటు ఉంటుందా అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి.
గోదావరి బ్యాక్ డ్రాప్ లో కుర్రాళ్ళ అల్లరి సరదా ప్రేమకథలో కులాల ప్రస్తావన లాంటి అంశాలు తీసుకున్న ‘ఆయ్’ సినిమా గురించి వివరాలు వస్తూ ఉంటే ఇంచుమించు ఇలాంటి కథతో నీహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా గుర్తుకు రావడం ఖాయం. ఎన్నో కథలు విని ‘ఆయ్’ ఓకే చేశామని నిర్మాత బన్నీ వాస్ చెపుతున్న నేపధ్యంలో ఈమూవీ పై అంచనాలు ఎన్నో ఉన్నాయి..