టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. నేటితో 69వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అభిమానులు ఘనంగా బర్త్‌ డే వేడుకలను జరుపుతున్నారు. ఫ్యాన్స్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నయ్య పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ''నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక

 శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు.. అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో. గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో రూ.ఐదు కోట్ల విరాళాన్ని జనసేనకు అందజేసి విజయాన్ని అందుకోవాలని మా

 ఇలవేల్పు ఆంజనేయుని సాక్షిగా అన్నయ్య ఆశీర్వదించారు. ఆయన ఆ రోజు ఇచ్చిన నైతిక బలం, మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞతలు తెలుపుతున్నా. తల్లిలాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుడిని మనసారా కోరుకుంటున్నా'' అని పవన్‌ పేర్కొన్నారు. మరోవైపు నేడు చిరుకు బర్త్ డే విషెస్‌ తెలియజేస్తూ విశ్వంభర నుంచి కొత్త పోస్టర్‌ షేర్ చేశారు మేకర్స్‌. అతీత శక్తులతో నిండిపోయిన త్రిశూలాన్ని చేతపట్టుకున్న చిరంజీవి లుక్‌ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.కొణిదెల శివశంకర్ వరప్రసాద్.. 1955 ఆగస్ట్ 22న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి స్వయంకృషితో మెగాస్టార్ గా మారారు. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా అభిమానులు రక్తదానం, అన్నదానం తదితర సేవాకార్యక్రమాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: