తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మహిళలపై అత్యాచారాలు, హిందూ మహిళలను మతం మార్చి లైంగికంగా వేధించే ఘటనలు తీవ్రమైనా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీమకుట్టినట్లు కూడా వ్యవహరించకపోవడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు డాక్టర్ శిల్పారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. దీనికి హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా హోంశాఖపై ఒక్కసారి కూడా సమీక్షించలేకపోవడంతో శాంతి భద్రతల పరిస్థితి మరింత దిగజారిందన్నారు. షేక్ జానీపై గతంలోనూ నేరచరిత్ర ఉందని, 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు ఆరునెలల పాటు జైలుశిక్ష విధించినట్లు స్వయంగా పోలీసులే వెల్లడించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి, చట్టపరంగా పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు డాక్టర్ శిల్పారెడ్డి.