సినీ రంగంతో ఎలాంటి సంబంధం లేని వారు కూడా ఆ రంగంలోకి రావాలని ఆరాటపడుతూ ఉంటారు. అలాంటిది సినిమా రంగంలో ఉండి సులువుగా అవకాశాలు అందిపుచ్చుకునేవారు మరింత హుషారుగా ఉంటారు. అందుకే హీరో మాస్ మహారాజా రవితేజ పిల్లలు ఇద్దరు సినిమా రంగంలోకి వచ్చేసారు. హీరో రవితేజ ఇద్దరు పిల్లలు ఒక కుమార్తె, ఒక కొడుకు ఇద్దరు సినిమా రంగాన్నే తమ కెరీర్ కోసం ఎంచుకోవడం.. దాదాపు ఖరారు అయింది. కుమార్తె నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారు. తన తండ్రి ఆర్టీ టీం వర్క్స్ కాకుండా.. వేరే బ్యానర్ పెట్టబోతున్నారు.
అంతకన్నా ముందుగా సితార సంస్థ నాగవంశితో కలిసి ఒకటి, రెండు చిన్న ప్రాజెక్టులు చేయబోతున్నారు. ప్రస్తుతానికి సితార సంస్థలో నిర్మాణ మెలకువలు నేర్చుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే హీరో రవితేజ ప్రతి రూపాయి దగ్గర జాగ్రత్తగా ఉంటారు. రూపాయి నష్టపోయే పనిలోకి ఆయన అస్సలు పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడరు. ఆయన పెట్టుబడులు అన్నీ రియల్ ఎస్టేట్‌లోనే. అలాంటిది కుమార్తె మాత్రం డబ్బు రిస్క్ ఉన్న నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ విషయంలో రవితేజకు పెద్దగా ఇష్టం లేకపోయినా కూతురు కోరిక మేరకు ఒకే చెప్పక తప్పలేదు అని తెలుస్తుంది.
ప్రస్తుతం ఓ సినిమాను శ్రీ విష్ణు హీరోగా చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. రవితేజ కుమారుడు ప్రస్తుతానికి డైరెక్షన్ ఎంచుకున్నారు. అతనికి సందీప్ రెడ్డి వంగా అంటే చాలా ఇష్టం. ఎవరితోనో రికమెండ్ చేయించుకుని సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్‌గా చేరిపోయాడు. భవిష్యత్తులో డైరెక్టర్‌గా సెటిల్ అవుతాడా.. లేదా హీరోగా మారతాడో.. చూడాలి. రవితేజ కూడా ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాలా రోజులు పని చేసి.. అప్పుడు హీరోగా మారాడు. ఇప్పుడు కొడుకు కూడా అదే బాటలో వెళుతున్నట్టు కనిపిస్తోంది.