తెలుగు సినిమా స్థాయి ఒక్కప్పటి కంటే ఇప్పుడు మెరుగ్గా ఉందనే చెప్పుకోవాలి. దర్శక ధీరుడు ఎప్పుడైతే బాహుబలి అనే సినిమా తీశాడో, అక్కడినుండి మిగతా సినిమా పరిశ్రమలు మనవైపు చూడడం మొదలు పెట్టాయి. దాంతో ఇక్కడి సినిమాలకు భారీతనం వచ్చింది. ఈ క్రమంలోనే ఇక్కడి నిర్మాతలు సినిమాలకు దండిగా ఖర్చు చేస్తున్నారు. అయితే ఆ ఖర్చు అనేది మార్కెట్ ఉన్న హీరోల మీద పెడితే పర్వాలేదు, కానీ... అంతగా మర్కెట్ లేని వారి మీద పెడితే మాత్రం, అంతకంటే పెద్ద రిస్క్ ఉండదు. ఇండస్ట్రీలో కొందరు మిడ్ రేంజ్ హీరోల విషయంలో ఇదే జరుగుతుంది. కథపై నమ్మకమో ఏమో తెలియదు కానీ, కొందరు నిర్మాతలు వారి మార్కెట్ విలువ కంటే కూడా డబుల్ ఖర్చు వారిపై పెడుతున్నారు.

స్టార్ హీరోలపై 200 కోట్ల బడ్జెట్ కాదు.. 400 కోట్లు బడ్జెట్ పెట్టినా ఏం కాదు. వాళ్ల మార్కెట్ ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి. ఉదాహరణకు ప్రభాస్ సినిమాలే తీసుకుంటే... ప్రతీ సినిమాను 400 కోట్లతో తీస్తున్నారు.. అయినా కూడా థియెట్రికల్ పక్కనబెడితే ముందు డిజిటల్, శాటిలైట్‌తోనే సుమారుగా 350 కోట్లు వసూలు చేసేస్తున్నాయి. ఇక విడుదలైన తరువాత వచ్చిన డబ్బులన్నీ బోనస్ అవుతున్నాయి. కానీ మీడియం రేంజ్ వారితో అలా కాదు. తాజాగా సాయి దుర్గ తేజ్, కొత్త దర్శకుడు రోహిత్ కాంబోలో హనుమాన్ నిర్మాతలు ఓ సినిమా చేస్తున్నారు. దీని నెక్ట్స్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో సెట్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి. తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఇది. కానీ ఇక్కడ ఆ హీరో మార్కెట్ విలువ ఏమిటో అందరికీ తెల్సిందే.

అదేవిధంగా హీరో నానిని తీసుకుంటే, హిట్ 3 కథపై సదరు నిర్మాతలు 70 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలతో చేయబోతున్న సినిమా బడ్జెట్ 100 కోట్లకు పైగానే ఉండబోతుంది అని టాక్ నడుస్తోంది. అయితే నాని మార్కెట్ ఒకసారి పరిశీలిస్తే... నాని హిట్ ఐన సినిమాలు కూడా ఇంతవరకు ఏదీ వంద కోట్లు వసూళ్లు చేయలేదు. ఆ తరువాత మాట్లాడుకోవలసింది... తేజ సజ్జా.. ఈ హీరోపై హనుమాన్ తర్వాత బడ్జెట్ భారీగానే పెడుతున్నారు నిర్మాతలు. మిరాయ్ బడ్జెట్ 50 కోట్ల వరకు ఉండబోతుంది. ఇందులో మంచు మనోజ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం విదితమే. ఈ వరుసలోకి వస్తారు, హీరో నాగ చైతన్య. ఈ హీరో నటిస్తున్న సినిమా తండేల్ బడ్జెట్ 80 కోట్లకు పైగానే ఉంది. చైతూ మార్కెట్ కంటే డబుల్ బడ్జెట్ ఇది. ఇదే విషయమై ఇపుడు విశ్లేషకులు కంగారు పడుతున్నారు. అయితే కథ బాగుంటే.. బడ్జెట్ సమస్యే ఉండదు అని చాలా సినిమాలు ఇక్కడ ప్రూవ్ చేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: