మహా నటుడు నందమూరి తారకరామారావు పౌరాణిక కథలతో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. అదేవిధంగా ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ రామాయణం మూవీ ద్వారా నటుడిగా నిరూపించుకున్నారు. చిన్న వయసులోనే రాముడిగా నటించి తాతకు తగ్గ మనవడిని చాటారు.జూనీయ‌ర్ ఎన్టీఆర్ అప్ప‌టికే తాత సీనియ‌ర్ ఎన్టీఆర్‌ న‌టించిన ‘బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర‌’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ భ‌ర‌తుని పాత్ర‌లో న‌టించాడు. మ‌న‌వ‌డి న‌ట‌ను ద‌గ్గ‌ర నుంచి చూసిన ఎన్టీఆర్, తార‌క్‌ను ప్రాధాన పాత్ర‌లో చూడాల‌ని ఆశ‌ప‌డ్డాడ‌ట‌. అలా కొన్నాళ్ళ‌కు సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌నకు అత్యంత సన్నిహితుడైన నిర్మాత‌ ఎమ్‌.ఎస్ రెడ్డిని పిలిపించి ఎన్టీఆర్‌తో సినిమా చేయమ‌ని చెప్పాడు. అప్ప‌టికి ఎన్టీఆర్ వ‌య‌సు 13ఏళ్ళు. ఈయ‌న వ‌య‌సుకు త‌గ్గ‌ట్టు క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని సీనియ‌ర్ ఎన్టీఆర్ చెప్ప‌డంతో ఎమ్ఎస్ రెడ్డి, గుణ‌శేఖ‌ర్‌ను పిలిపించాడు. ఇక ఈ ముగ్గురు క‌లిసి ఎన్టీఆర్ వ‌య‌సుకు ఎలాంటి క‌థ అయితే బావుంటుంద‌ని చ‌ర్చ‌లు జ‌రిపారు. అప్పుడే గుణ‌శేఖ‌ర్ రామాయ‌ణంనే బాలల‌తో తెర‌కెక్కిద్దాం అని సూచించాడ‌ట‌. ఆ ఐడియా న‌చ్చి సీనియ‌ర్ ఎన్టీఆర్ కూడా వెంట‌నే సినిమాను మెద‌లు పెట్ట‌మ‌ని ఎమ్ఎస్ రెడ్డికి చెప్పాడ‌ట‌.నెల‌రోజుల్లో పిల్లల‌ను ఎంపిక చేసి, మ‌రో న‌ల‌భై రోజులు వాళ్ళ‌కు యాక్టింగ్‌ను నేర్పించారు. ఇక 1995 జూన్‌లో ఈ చిత్రం షూటింగ్‌ను మొద‌లు పెట్టారు. 

ఈ చిత్రంలో తార‌క్ రాముడిగా న‌టించ‌గా సీత‌గా స్మిత న‌టించింది. ఇక షూటింగ్‌లో తార‌క్ అల్ల‌రి బాగా చేసేవాడ‌ట‌. షూటింగ్ కోసం తెచ్చిన బాణాలు విర‌గ్గోట్టడం,వాన‌ర‌సైన్యంపై స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో వాళ్ళ తోక‌లు లాగడం, మూతులు పీక‌డం, బాణాల‌ను గుచ్చ‌డం వంటి అల్ల‌రి పనులు బాగా చేసేవాడ‌ట‌.  దాంతో కొన్ని సార్లు గుణ‌శేఖర్‌, తార‌క్‌ను తిట్టేవాడ‌ట‌.దాంతో తార‌క్ అలిగి ఇంటికి వెళ్ళిపోయేవాడ‌ట‌. చేసేదేమి లేక గుణ‌శేఖ‌ర్ తార‌క్‌ను బ‌తిమిలాడి మ‌ళ్ళీ షూటింగ్‌కు తీసుకువ‌చ్చేవాడ‌ట‌. అలా 6నెల‌ల్లో షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల‌ను మొద‌లు పెట్టారు. అన్ని స‌రిగ్గా జ‌రుగుతున్న క్ర‌మంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ క‌న్నుమూశాడు. మ‌న‌వ‌డిని హీరోగా వెండితెర‌పై చూడాల‌నే ఆశ నిరాశ‌గానే మిగిలింది. సీనియ‌ర్ ఎన్టీఆర్ చ‌నిపోయిన రెండు నెల‌ల త‌ర్వాత 1996 ఏప్రిల్ 14న‌ ‘బాలరామాయ‌ణం’ విడుద‌లైంది. విడుద‌లైన అన్ని చోట్ల ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్ష‌కుల పరుగులు తీసేవార‌ట‌. రామాయ‌ణం లాంటి గొప్ప క‌థ‌లో బాల‌లు ఎలా న‌టించారో అని ఆత్రుత‌తో ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ట‌.ఈ చిత్రం చూసిన ప్రేక్ష‌కుల తార‌క్‌ను చూసి అచ్చం తాత‌లాగే ఉన్నాడ‌ని, ఆయ‌న‌లాగా గొప్ప న‌టుడ‌వుతాడంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ చిత్రానికి ఉత్త‌మ బాల‌ల చిత్రంగా నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చింది. దాంతో పాటుగా ఉత్త‌మ బాల‌ల చిత్రంగా నిర్మాత ఎమ్ఎస్ రెడ్డికి, ఉత్త‌మ బాల న‌టిగా సీత పాత్ర‌లో న‌టించిన స్మిత‌కు నంది అవార్డులు వ‌చ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: