- రెండేళ్ల తర్వాత దేవరగా తెరపైకి
- సినిమాకు దూరంగా నారా, నందమూరి అభిమానులు
- గతంలో తమ వాడు అనుకున్న వాళ్లే ఇప్పుడు కాదనుకున్నారు..
- ఖమ్మంలో బెనిఫిట్ షో పడే ముందు వరకు అమ్ముడు పోని టికెట్లు
- మిక్స్‌డ్ టాక్‌తో మ‌రింత ఎదురుదెబ్బ‌

( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

జూనియర్ ఎన్టీఆర్.. యంగ్ టైగర్.. వెండితెర ఇలవేల్పు, నవరస నటన సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వంశం నుంచి వచ్చిన యువ కథానాయకుడు. ఆ పెద్ద ఎన్టీఓడికి బాలయ్య బాబు తర్వాత మరో తరం నట వారసుడిగా.. తెరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ అప్రతిహతంగా కొనసాగింది. చిన్న వయసులోనే లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుని.. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో పరిణతికి మించిన నటనతో అల్లాడించాడు. దీనికి ఉదాహరణ సింహాద్రి,  రాఖీ తదితర సినిమాలు. ఆ సమయంలో ఆయన శరీరాకృతి ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. లావుగా ఉన్నప్పటికీ తన నటన,  డాన్స్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. ఇక అభిమానులైతే మా 'చిన్న ఎన్టీఓడు' అని పిలుచుకున్నారు. తాతకు తగ్గ మనవడు.. బాబాయ్ కి తగ్గ అబ్బాయి గా.. పేరు తెచ్చుకున్నాడు.  


ఓ పక్క బాలయ్య బాబు,  మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ నందమూరి అభిమానులకు వెండితెర కనులవిందు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు అందిన విజయాల వెనుక ఆయన శ్రమ ఎంత ఉందో.. నందమూరి అభిమానుల ప్రోత్సాహం కూడా అంతే ఉంది. కానీ అలాంటి జూనియర్ ఎన్టీఆర్ సినీ జీవితంలో ప్రస్తుతం కొంత ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి. సినిమాలు రాజకీయాలు వేరని అందరికీ తెలిసినప్పటికీ.. నందమూరి వంశం విషయంలో మాత్రం ఈ రెండు లేకుండా ఊహించుకోలేం. ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్ వెండితెరపై వెలిగిన తరువాత రాజకీయ అరంగేట్రం చేసి సంచలనాలు సృష్టించి కారణజన్ముడిగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. అంతటి మహోన్నతుడి మనవడిగా  జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు తీసిన.. రాజకీయాల్లోకి వచ్చిన.. అక్కున చేర్చుకునేది మాత్రం నందమూరి అభిమానులే. ఎందుకంటే టిడిపి కూడా ఆ నందమూరి అభిమానులదే కాబట్టి. ఏనాటికైనా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నేతగా జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుతాడు అన్న ఆశతో చాలామంది ఉన్నారు.


ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సేవలందించారు. నాడు ప్రచారంలో ఆయన చేసిన ప్రసంగాలు తాతను మరిపించాయి. తమ భవిష్యత్తు నేత దొరికాడంటూ అందరూ సంబరపడ్డారు. తెలియకుండానే టిడిపి క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్కు దాసోహమైంది. దాంతో అటు సినీ కెరీర్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగిపోయింది. మహిళలు, యువతులు కూడా ఆయనకు అభిమానులుగా మారిపోయారు. కానీ ఇవే రాజకీయాలు రాను రాను జూనియర్ ఎన్టీఆర్కు ప్రతిబంధకంగా మారాయి. 2019లో విభజిత్ ఆంధ్రప్రదేశ్లో టిడిపి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసిపి అధికారం చేపట్టింది. ఆ తరువాత పరిణామాల్లో జూనియర్ ఎన్టీఆర్ అండతో టిడిపి ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు వైసీపీలోకి వెళ్లిపోయారు.


ఈ పరిణామాలను టిడిపి శ్రేణులు, నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటివరకు చంద్రబాబు, బాలయ్య.. టిడిపి కి వీరాభిమానులుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ పార్టీ మారడం వెనుక జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం ఉందన్న ప్రచారం బాగా జరిగింది. దానికి తోడు అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి తండ్రి కూడా వైసిపి కండువా కప్పుకోవడం.. అభిమానులను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో తన వాళ్లే పార్టీని వీడుతుంటే జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉండిపోవడం వెనక ఆంతర్యం ఏమిటన్నది అర్థం కాక అభిమానులు కలత చెందారు. ఇదేంటి మా చిన్న ఎన్టీవోడు.. వీటి గురించి ఏం మాట్లాడట్లేదని ఆవేదన చెందారు. ' తెర ' వెనుక ఏం జరిగిందో తెలియక నారా, నందమూరి కుటుంబాలు ఒకటిగా ఉండాలని కోరుకుంటూ..  మనసులో ఆ పెద్ద ఎన్టీఆర్ ని తలుచుకోవడం తప్ప వారు ఏం చేయలేకపోయారు.


టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తమకు అండగా లేడు అన్న అసహనం అభిమానుల్లో రాను రాను మరింత పెరిగిపోయింది. ఇదే సమయంలో బాలకృష్ణ సింహ, లెజెండ్, అఖండ, వీర సింహారెడ్డి లాంటి వరుస విజయాలతో దూసుకుపోవడం అభిమానుల్లో ధైర్యాన్ని నింపింది. అప్పటికే తెలియకుండానే నందమూరి అభిమానులు కాస్త బాలయ్య, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులుగా విడిపోయారు. అప్పటివరకు బాలకృష్ణ అభిమానుల్లో మహిళలు,  యువతుల సంఖ్య చాలా తక్కువ. కానీ జూనియర్ ఎన్టీఆర్ వ్యవహార శైలి పై అసంతృప్తితో ఉన్న మహిళా అభిమానులు ఎక్కువ శాతం మంది బాలకృష్ణను అభిమానించడం మొదలుపెట్టారు. దాంతో యువతరం హీరోలకు దీటుగా బాలయ్య బాబు ఫ్యాన్ బేస్.. ఒక్కసారిగా పెరిగిపోయింది. యువతులు జై బాలయ్య స్లోగన్ అందుకోవడం ఒక చరిత్ర అనే చెప్పుకోవాలి.


ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా తన ఫని తాను చేసుకుపోతున్నాడు. కానీ నందమూరి అభిమానులు మాత్రం ఎప్పటికైనా తమ వాడే అన్నట్టుగా.. బాధను దిగమింగుకుంటూ అభిమానాన్ని చంపుకోలేక పెద్ద ఎన్టీఆర్ నట వారసుడు గానే చూశారు. కానీ 2019 - 24 మధ్య ఆంధ్రప్రదేశ్లో వైసిపి హయాంలో జరిగిన అనేక సంఘటనలు అభిమానుల హృదయాలను గాయపరిచాయి. ఎన్టీఆర్ కూతురు, నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి అసెంబ్లీలో వైసిపి నేతలు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అణుంగు శిష్యులుగా ఉన్నటువంటి వల్లభినేని వంశీ,  కొడాలి నాని లాంటి వాళ్ళు అనుచిత పదజాలంతో అవమానించారు. ఎన్నోసార్లు చంద్రబాబు పట్ల దురుసుగా ప్రవర్తించారు. కనీసం ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వని సందర్భాలు ఎన్నో. అంతేకాదు నారా , నందమూరి అభిమానులను కలచివేసిన మరో ముఖ్యమైన ఘటన చంద్రబాబు అరెస్ట్. స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమాలు చేశారంటూ తప్పుడు కేసులో జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు అరెస్టు చేయించి రాజమండ్రి జైల్లో నిర్బంధించింది.


ఆ సమయంలో ప్రపంచ నలుమూలలో ఉన్న యావత్ తెలుగుజాతి స్పందించింది. చంద్రబాబుకు అండగా మేమున్నామంటూ నినదించింది. అలాంటి సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ నోరు విప్పలేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా మామయ్య అరెస్టును ఖండించలేదు. దాంతో అభిమానుల మనసు ముక్కలైపోయింది. రాజకీయాలు ఎలా ఉన్నా సినిమాలు ఎలా ఉన్న కనీసం కుటుంబ సభ్యుడిగా అయినా జూనియర్ ఎన్టీఆర్ నోరు విప్పలేదు అంటూ బాధపడ్డారు. ఇవే అంశాలు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పై ప్రభావం చూపుతున్నాయి అనడంలో సందేహం లేదు. రెండేళ్ల తర్వాత ఆయన సినిమా దేవర రిలీజ్ అయింది. సినిమా విజయం సాధించిందా లేదా అనేది పక్కన పెడితే.. ముందు ఆ సినిమాను చూసేందుకు నందమూరి అభిమానులే ముందుకు రాకపోవడం గమనార్హం.


అందుకు ఖమ్మం అభిమానుల్లో, కమ్మ సామాజిక వర్గం వారిలో జరిగిన చర్చే నిదర్శనం. తమకు జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానం ఉండేదని, కానీ ఆయన వ్యవహార శైలి నచ్చడం లేదని, ఆయన సినిమాలు తాము చూడం అని బహిరంగంగానే చెప్పడం విశేషం. ఇక రెండు థియేటర్లలో బెనిఫిట్ షో వేస్తే.. రాత్రి వరకు కూడా టికెట్లు అమ్ముడుపోని పరిస్థితి. చివరకు బెనిఫిట్ షో నిర్వాహకులు.. తమ వద్ద టికెట్లు ఉన్నాయి కొనుక్కోండి అంటూ వాట్సాప్ గ్రూపులో మెసేజ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ఖమ్మంలో ఉన్నటువంటి నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ తీరుపై కోపంగా ఉండటమే. ఎందుకంటే బెనిఫిట్ షో టికెట్ వెయ్యి రూపాయలు ఉన్నప్పటికీ అభిమానులు  ఏ మాత్రం వెనక్కి తగ్గరు. ఇదే ఖమ్మంలో బాలయ్య బాబు ఇటీవల సినిమాలకు బెనిఫిట్ షో టికెట్లు 1000 రూపాయలకు అమ్మిన సందర్భంలో అసలు అవి దొరకలేదు. కానీ దేవర సినిమా విషయంలో అభిమానుల్లో అంత ఉత్సుకత కనిపించలేదు.


ఏది ఏమైనా బెనిఫిట్ షో పడిన తర్వాత..  జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయిందని టాక్ రావడంతో సగటు అభిమానులు నిరుత్సాహం చెందారు. అభిమానం చంపుకోలేని వారు కొందరు థియేటర్ గేటు బయట నిలుచొని మరి వాకబు చేయడం విశేషం. ' జూనియర్ ఎప్పటికైనా నువ్వు మా వాడివే.. కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్న ఓర్చుకోవాలి.. తాత పెట్టిన పార్టీ కి అండగా ఉండాలి. గతంలోలా అభిమానులతో కలిసి పండగ చేసుకోవాలి. నీ వెండితెర నట జీవితం వెయ్యేళ్ళు వెలిగిపోవాలి ' అంటూ సగటు అభిమానులు కోరుకోవడం కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: