తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున, నాగచైతన్యల గురించి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ పరిశ్రమ మొత్తం సమంత, నాగార్జునలకు మద్దతు పలుకుతోంది. కేటీఆర్ లీగల్ నోటీసు పంపగా, మంత్రిపై నాగార్జున పరువు నష్టం కేసు పెట్టారు. ఇటీవల జూమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నాగార్జున తాను పెట్టిన క్రిమినల్ పరువు నష్టం కేసు గురించి చాలా వివరంగా మాట్లాడారు. కొండా సురేఖపై రూ.100 కోట్లకు మరో పరువునష్టం దావా వేయాలని యోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నాగార్జున మాట్లాడుతూ, "ఆమె దారుణమైన వ్యాఖ్యలను విస్మరించలేం. ఇప్పుడు, ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు సమంతకు క్షమాపణలు చెప్పింది. అయితే నా కుటుంబం సంగతి ఏమిటి? మాకు సారీ అని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇది చాలా అన్యాయం. మా గురించి మరీ అంత దారుణంగా మాట్లాడింది. మేము మా ఆడవాళ్లని అలా ట్రీట్ చేస్తామని తప్పుడు కూతలు కూసింది. ఇండస్ట్రీలో, ప్రజలలో ఎంతో గౌరవం ఉన్న మా ఫ్యామిలీ గురించి ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పినా పరువు నష్టం కేసు వెనక్కి తీసుకోము. ఇది నిన్నటిదాకా మా కుటుంబానికి సంబంధించిన సమస్య అనుకున్నా, కానీ అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు నన్ను, రేపు వేరే ఫ్యామిలీని టార్గెట్ చేయొచ్చు. అలా పొలిటిషియన్లు విచ్చలవిడిగా సినిమా వాళ్ళని సాఫ్ట్ టార్గెట్ చేసి వారి పరువు కి భంగం కలిగించేలా మాట్లాడవచ్చు. అలా జరగవద్దనే ఎలాగైనా సరే ఈ పరువు నష్టం కేసును ముందుకు తీసుకెళ్దాం అని చూస్తున్నా. ఈ కేసు విషయంలో సత్వర న్యాయం, తీర్పు వస్తుందని భావిస్తున్నా." అని అన్నారు.

తనకు, తన కుటుంబానికి క్షమాపణలు చెబితే వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటారా అని అడిగినప్పుడు, నాగార్జున "నో, నాట్ ఎట్ ఆల్" అని గట్టిగా చెప్పారు. "ఇది ఇకపై వ్యక్తిగతం కాదు. అపవాదు నాకు, నా కుటుంబానికి మించిపోయింది" అని ఆయన అన్నారు. ఈ పరువునష్టం కేసులకు ఏళ్లు పడతాయని తనకు తెలుసు, అయితే సుదీర్ఘ పోరాటానికి సిద్ధమని నాగ్ చెప్పారు. నాగ చైతన్య, సమంతల విడాకులకు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ కారణమని కొండా సురేఖ గతంలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: