ప్రస్తుతం ప్రపంచ గమనం మారుతుంది. ఒకప్పుడు నక్సలిజం, నక్సలైట్లు అంటే నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారు. ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేస్తారు. వారి జీవితాలు త్యాగాలు చేస్తారు. కానీ.. ఇప్పుడు నక్సలిజం దాదాపు అంతరించే దశలో ఉంది. ఒకప్పుడు రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి సైతం నక్సలిజాన్ని పొగిడేవారు. నక్సలైట్లు.. దేశభక్తులు అని ఎన్టీఆర్ అన్నారు. తనది మావో భావజాలం అని కేసిఆర్ ప్రకటించుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వారి భావజాలానికి ఆకర్షితులు అయ్యారు. నక్సలిజం అంటే పోలీసులను, రాజకీయ నేతలను చంపడం అనే భావన రాకముందు వారి పోరాటం యువతను కదిలించింది. అడవుల్లోకి వెళ్లి అన్యాయంపై పోరాడాలన్న ఉడుకు రక్తం ఉన్నవారికి నక్సలిజం దారి చూపించేది.


కానీ ఇప్పుడు నక్సల్స్ అంతమైపోతున్నారు. నక్సలిజంలోకి వచ్చేవారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. ఈ ఏడాది ఇప్పటికే 9 నెలలు గడిచాయి. ప్రతినెల ఎన్కౌంటర్ జరుగుతూ వస్తోంది. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్న ప్రతి చోట ఎన్కౌంటర్లు జరిగాయి. అగ్ర నేతలు అందరూ చనిపోతున్నారు. తాజాగా అబూజ్ మడ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఏకంగా 32 మంది చనిపోయారు. ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్లు చనిపోయారు అని పోలీసులు గర్వంగా ప్రకటించుకున్నారు. అంటే ప్రధాన నాయకత్వం అంతా చనిపోయింది. చివరికి జగన్ పేరుతో తెలుగు మీడియాకు సమాచారం ఇచ్చే నక్సలైట్‌ను కూడా పోలీసులు ఇటీవల ఎన్కౌంటర్ చేసేశారు.


ఇప్పుడు అడవుల్లో ఉండే ఆదివాసులు కూడా నక్సల్స్ గా మారటం లేదు. ప్రపంచ రూపురేఖలు మారుతున్నాయి. తమ జీవన ప్రమాణాలు పెంచుకోవాలని నక్సలైట్లు ఆశపడుతున్నారు. వారు ఎవరు ఇప్పుడు అడవుల్లో ఉండి తుపాకీ గొట్టం ద్వారా విప్లవం సాధిస్తామని అనుకోవటం లేదు. అందుకే కొత్తగా నక్సల్స్‌లో చేరేవారు లేరు. 2026 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని గతంలో అమిత్ షా ప్రకటించారు. ఇప్పుడు ఆయన మాటలు నిజం అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో చూస్తే నక్సలిజం అనేది దాదాపు మనదేశంలో చివరి దశలో ఉంది. నక్సలిజం చనిపోవచ్చు కానీ.. ఈ భావజాలం అనేది అలా ఉండిపోతుందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: