ఇక ఇప్పుడు రజినీకాంత్ ‘ వేట్టయన్’ టైటిల్‌ను కనీసం తెలుగు లోకి మార్చి రిలీజ్ చేయండి అని ప్రశ్నించే స్థితిలో కూడా మన డిస్ట్రిబ్యూటర్లు లేరు. ఇది ఒక్కటే కాదు గతంలో వచ్చిన తునీవు, వలిమై , తంగలాన్ రాబోయే కొంగువా వంటి సినిమాల అర్థం ఏమిటో చూసే ప్రేక్షకుడికి కూడా తెలియకుండా చూడాల్సి వస్తుంది . వారి వారి భాష లలో వారి భాష గొప్పదనాన్ని, కళాత్మకతని గౌరవించుకోవాలి, అలాగే తెలుగు ప్రేక్షకులని ఇంత తేలికగా తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. తెలుగుని గౌరవించని వాళ్ళని కూడా తెలుగువాళ్లు గౌరవించడం, ఆదరించడం , ఆ సినిమాలని చూడ్డానికి మన డబ్బులు ఖర్చుపెట్టడం మన గొప్పతనం కాదు .
డబ్బింగ్ సినిమా రైట్స్ కొనుగోలు దారులు కూడా చూస్తున్నాం కదా అని ఈ మద్య ఎలా పడితే అలా చేస్తున్నారు . ఎలా ఉన్నా చూస్తారు లే అన్నట్టు చేస్తున్నారు . మనం పర భాష సినిమాలు ఆదర్శిస్తున్నాం కాబట్టే వారు సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే క్రమంలో తమిళ ప్రేక్షకులు తెలుగు సినిమాలను ఎప్పుడూ పెద్దగా ఆదరించరు. వారికి వాళ్ల భాష వారి నటులే గొప్ప. తెలుగు ప్రేక్షకులు మాత్రం అలా కాదు. సినిమా నచ్చితే భాష నటులతో సంబంధం లేకుండా ఆ సినిమాను ఆదరిస్తూ వెళ్తున్నారు. దాన్నే చులకనగా తీసుకొని తెలుగు భాషను అగౌరవపరచడం మంచిది కాదు. ఇప్పటికైనా తమిళ సినిమా పంపిణీదారులు, నిర్మాతలు సరిగ్గా సినిమాలను విడుదల చేయాలని అంటున్నారు.