సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్‌-ది హంటర్‌’ ట్రైలర్‌ బుధవారం విడుదలైంది. ఈ సినిమాలో రజనీకాంత్‌ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా కనిపించనున్నారు. ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా సందర్భంగా ఈ నెల 10 ప్రేక్షకుల ముందుకురానుంది. ట్రైలర్‌ ఆద్యంతం యాక్షన్‌ అంశాలతో సాగింది. ‘క్రైమ్‌ క్యాన్సర్‌లాంటిది. దానిని పెరగనివ్వకూడదు’ ‘నన్ను ఏ పోస్టులో తిప్పి కొట్టినా నేను మాత్రం పోలీస్‌ వాడినే సార్‌. నా నుంచి వాడిని కాపాడటం ఎవరి వల్లా కాదు’ అంటూ రజనీకాంత్‌ చెప్పిన డైలాగ్స్‌ హైలైట్‌గా నిలిచాయి. ట్రైలర్‌లో అమితాబ్‌బచ్చన్‌, రానా, ఫహాద్‌ ఫాజిల్‌

 పాత్రలను పరిచయం చేసిన తీరు, వారు చెప్పిన డైలాగ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. రజనీకాంత్‌ తనదైన స్టైల్, మేనరిజమ్స్‌తో మెప్పించారు. పోలీస్‌ వ్యవస్థకు, సంఘ విద్రోహక శక్తులకు మధ్య జరిగే పోరు నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతున్నది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్నందించారు. ఈనేపథ్యంలో ఈ సినిమా కథ గురించి రజనీ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టి.జె.జ్ఞానవేల్‌ మొదట తీసుకువచ్చిన కథకు రజనీ మార్పులు సూచించారట. దానిలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేయమని కోరారట.

కుమార్తె సౌందర్య సిఫార్సు మేరకు రజనీకాంత్‌ 'వేట్టయన్'  కథను విన్నట్లు చెప్పారు. ''టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో వచ్చిన 'జైభీమ్' సినిమా నాకెంతో నచ్చింది. కానీ, గతంలో జ్ఞానవేల్‌తో ఎప్పుడూ మాట్లాడే అవకాశం రాలేదు. 'వేట్టయన్' కథ వినమని సౌందర్య నాకు చెప్పడంతో విన్నాను. బాగుందనిపించింది. అయితే, ఈ సినిమా తీయడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. అందుకే కథలో కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేయాలని కోరాను. 10 రోజుల సమయం అడిగాడు. 'కమర్షియల్‌ సినిమాగా మారుస్తాను. కానీ, నెల్సన్‌ దిలీప్‌కుమార్‌, లోకేశ్‌ కనగరాజ్‌ల సినిమాగా మార్చలేను. నా శైలిలో ప్రేక్షకులకు నచ్చేలా ఈ కథను మారుస్తాను' అని జ్ఞానవేల్‌ చెప్పాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: