ఆ ప్రేక్షకుడే లేకపోతే సినిమా ఉంటుందా.. ప్రేక్షకుడు లేకపోతే స్టార్ హీరో దర్శకుడు నిర్మాతలు ఉంటారా.. ఉండే ప్రసక్తే లేదు. కానీ ఇప్పుడు ఆ ప్రేక్షకుడికే సినిమా భారం అయిపోయింది. రోజు రోజుకు దూరం అయిపోతుంది. దీంతో పేద మధ్యతరగతి ప్రేక్షకులు అందరూ కూడా సినిమా చూడాలంటెనే బెంబేలెత్తిపోతున్నారు. ఒకప్పుడు పండగ వచ్చింది అంటే చాలు భార్య పిల్లలతో కలిసి ఓ మంచి సినిమాకు వెళ్లి.. రోజు ఉండే జాబ్ టెన్షన్ ల నుంచి కాస్త ఉపశమనం పొందాలి అనుకునేవాడు సామాన్యుడు. కానీ ఇప్పుడు అలా సినిమాకు వెళ్దామంటే చాలు పెరిగిపోయిన టిక్కెట్ రేట్లు సామాన్యుడి గుండెలు గుబేల్ అనేలా చేస్తున్నాయి.
ఒక్కరోజు ఫామిలీతో కలిసి సినిమాకు వెళ్ళామంటే 3000 సామాన్యుడు జేబు నుంచి ఖాళీ కావాల్సిందే. చాలీచాలని జీతంతో ఇంటి బాధ్యతలను నెట్టుకొచ్చే ఒక సామాన్యుడు సినిమా కోసం ఇంత ఖర్చు పెట్టగలడా.. దీంతో సినిమాకు వెళ్లాలంటేనే సామాన్యుడు భయపడుతున్నాడు. కానీ ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? నిర్మాతలే. ఏకంగా హీరోలు అడిగినంత పారితోషకం ముట్ట చెబుతున్నారు. కాస్త ఒక సినిమా హిట్ అయింది అంటే చాలు వందల కోట్ల రూపాయలు హీరోలకు కట్టబెడుతున్నారు. చివరికి నిర్మాణ వ్యయం పెరిగిపోయి ఎక్కడ నష్టాలు వస్తాయో అని భయపడిపోయి.. చివరికి టికెట్ రేట్లను భారీగా పెంచేస్తున్నారు.