సాధారణంగా తెలుగు సినిమాలన్నీ స్టార్ హీరోల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. హీరో తరువాతే మిగతా తారాగణం చుట్టూ కధలు అల్లబడతాయి. ఇక్కడ హీరోయిన్లకు కూడా పెద్ద స్క్రీన్ స్పేస్ అనేది ఉండదనే విషయాన్ని చెప్పాల్సిన పనిలేదు. కానీ ఈ మధ్య కాలంలో భారీ చిత్రాల విషయంలో హీరో లేని సన్నివేశాలు ఎక్కువగా తీయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే మన దర్శకులు తమ సినిమాలో హీరోలకి తక్కువ సీన్స్ రాస్తున్నారా? కథలో హీరో కంటే ఇతర పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నారా? లేదా స్టార్ హీరోలకి శ్రమ లేకుండా, షూటింగ్ లో ఇతర టెక్నిక్స్ ఏమైనా ఫాలో అవుతున్నారా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం కావడం కొసమెరుపు. మరీ ముఖ్యంగా ఆయా హీరోల అభిమానులు అయితే ఈ విషయంలో తెగ ఫీల్ అయిపోతున్నారు.

మొన్నటికి మొన్న రిలీజ్ అయిన దేవర సినిమాలో దాదాపు అరగంట తరువాత హీరో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. అది చూసిన ఎన్టీఆర్ అభిమానులు మానసికంగా కుంగిపోయారు. మరోవైపు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా షూటింగ్ షురూ చేస్తున్నారు. హీరోలు డేట్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన మీద కీలక సన్నివేశాలను షూట్ చేస్తూ ఆ మధ్యలో మిగతా తారాగణం చుట్టూ అల్లుకున్న సీన్స్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికొస్తే, ప్రస్తుతం 2 సినిమాల్లో నటిస్తున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' పార్ట్-1.. సుజీత్ డైరెక్షన్ లో OG చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి.

అదేవిధంగా, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రెండు మూడు సినిమాలను ఒకేసారి చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' మూవీ చేస్తున్నారు. కల్కి వచ్చే వరకూ ఈ సినిమాలో హీరో లేని సీన్స్ తీస్తున్నారనే టాక్ వినిపిస్తూనే ఉంది. అదేవిధంగా ఇటీవలే హను రాఘవపూడి డైరెక్షన్ లో 'ఫౌజీ' సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేసారు ప్రభాస్. మొదటి షెడ్యూల్ లో హీరో లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా టాక్. సలార్-2 షూటింగ్ అనుకున్నప్పుడు కూడా ఇవే రూమర్స్ వినిపించాయి. నిజానికి తెలుగు సినిమాల్లో హీరో లేని సన్నివేశాలు పెద్దగా ఉండవు. కానీ ఇపుడు ట్రెండ్ మారింది. హీరోల డేట్స్ అనేవి గగనంగా మారిన ఈ తరుణంలో హీరోలకు స్క్రీన్ స్పేస్ కుదిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ విషయంలో అటు అభిమానులతో పాటుగా మన హీరోలు కూడా గుర్రుగా ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: