మొన్నటి దేవరతో దాదాపుగా పెద్ద సినిమాలు రిలీజ్ అయిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టీ త్వరలో రిలీజ్ కాబోతున్న పుష్ప 2 పైనే ఉంది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పుష్ప సినిమాకి సెకండ్ పార్టుగా రాబోతున్న ఈ సినిమాపైన భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు అల్లు అర్జున్, మెగాభిమానుల వార్ నేపథ్యంలో ఎట్టిపరిస్దితుల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిన పరిస్దితి అల్లు అర్జున్ కి ఏర్పడింది. లేదంటే మెగాభిమానులు ఒక రేంజులో ఏకిపారేస్తారు. అయితే అలాంటి వత్తిళ్లు తన మీద పడనివ్వకుండా సుకుమార్ చాలా జాగ్రత్తగా సినిమా అన్ని అంశాలు అద్బుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అని వినికిడి.
మరీ ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ మిస్ కాకుండా ఉండేందుకు సుక్కు తగిన జాగ్రత్తలు తీసుకున్నారని టాక్ వినబడుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు VFX వర్క్ యూరప్ లో జరుగుతున్నట్టు భోగట్టా. జపాన్, శ్రీలంక వంటి వైవిధ్యమన లొకేషన్స్ లు, అడవులలో షూట్ చేయటంతో వాటిని ఒకే తాటిపై తెచ్చి, ఒకే చోట చిత్రీకరించినట్లు అనిపించటానికి VFX వాడుతున్నారని అంటున్నారు. పుష్ప 2 లో కొన్ని పార్ట్ లు CGI లో క్రియేట్ చేసినప్పటికీ, VFX కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారట. ఈ క్రమంలోనే దాదాపు 600 నుంచి 800 షాట్స్ దాకా రీవర్క్ చేసారని వినికిడి. దాంతో నిర్మాతలకు దండిగా డబ్బు ఖర్చు అవుతోందని తెలుస్తోంది.
ఇకపోతే అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా దుమ్ము దులిపిన సంగతి విదితమే. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా, జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని రికార్డు సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది.. ఈ క్రమంలో పుష్ప2 పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.