సరిగ్గా 3 వారాల కిందట ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఎన్టీఆర్‌ 'దేవర' సినిమా, మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు రాబట్టి, ఇంకా తన ఉనికిని బాక్సాఫీస్ వద్ద చాటుకుంటోంది. మాస్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ముఖ్య పాత్రను బాలీవుడ్‌ స్టార్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ పోషించిన విషయం అందరికీ తెలిసిందే. సైఫ్‌ అలీ ఖాన్‌ పోషించిన భైరా పాత్ర సినిమాకి చాలా ఉపయోగపడిందని విశ్లేషకులు అంటున్నారు. అంతే కాకుండా దేవర సినిమాలో ఎన్టీఆర్‌ కి సరైన పోటీగా భైరా పాత్ర నిలవడం వల్లే హిట్ టాక్ దక్కిందని, లేదంటే ప్రేక్షకులు తిరస్కరించే వారు అనే అభిప్రాయాలు కూడా బి టౌన్లో వినబడుతున్నాయి.

మరోవైపు టాలీవుడ్లో అయితే, బాలీవుడ్‌ నుంచి సైఫ్ ని తీసుకు రావాల్సిన అవసరం ఉందా? ఇక్కడే అంతకుమించిన ఆర్టిస్టులు ఉన్నారు కదా? అనే వారు కూడా లేకపోలేదు. అయితే సినిమాకు పాన్‌ ఇండియా అప్పీల్‌ ఇవ్వడం కోసం సైఫ్‌ ని తీసుకు వచ్చారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే సినిమాలోని పాత్ర డిమాండ్ మేరకే సైఫ్‌ అలీ ఖాన్‌ ను భారీ పారితోషికం ఇచ్చి మరీ తీసుకు వచ్చారు అనే టాక్ ఇపుడు వినిపిస్తోంది. సైఫ్ అలీ ఖాన్‌ బాలీవుడ్‌ లో హీరోగా చేసిన సినిమాలకే దాదాపు రూ.10 కోట్ల పారితోషికం అందుకొనేవాడట. అలాంటిది దేవర సినిమాకు మాత్రం ఆయనకు ఏకంగా రూ. 12.5 కోట్లను డిమాండ్ చేసారని టాక్.

ఆయన సినిమాలో చేసిన పాత్ర నిడివి ఎక్కువ ఉండడంతోనే ఆయన ఎక్కుడ డేట్లు సర్దుబాటు చేయాల్సి వచ్చిందట. దాంతోనే అంత భారీ పారితోషికం ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. జాన్వీ కపూర్‌ సైతం దేవర సినిమాలో నటించినందుకు గాను అత్యధికంగా రూ.5 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందని గుసగుసలు వినబడుతున్నాయి. ఇక ఎన్టీఆర్‌ ఈ సినిమాలో నటించినందుకు గాను రూ.60 కోట్ల పారితోషికం తీసుకుని లాభాల్లో వాటాను సైతం దక్కించుకున్నాడని వినికిడి. ఇప్పటి వరకు సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.550 కోట్ల వసూళ్లు నమోదు చేయగా లాంగ్ రన్‌లో సినిమా రూ.600 కోట్లకు చేరుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: