- శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు పాట ఇప్ప‌ట‌కీ తెలుగు పెళ్లిళ్ల‌లో ఉండాల్సిందే
- తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెక్కు చెద‌ర‌ని సినిమా

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

భారతీయ దాంపత్య జీవన ఔన్నత్యాన్ని, విశిష్టతను, కుటుంబ విలువలను చాటిచెప్పిన గొప్ప సినిమా పెళ్లి పుస్తకం. రాజేంద్రప్రసాద్ హీరోగా, దివ్యవాణి హీరోయిన్గా ప్రముఖ దర్శకులు బాపు తెర‌కెక్కించిన ఈ కుటుంబ కావ్యం అప్పట్లో సంచలనం. ముళ్ళపూడి వెంకటరమణ రాత రాసి శ్రీకారం చుట్టిన పెళ్లి పుస్తకం.. 1991 ఏప్రిల్ 1న రిలీజ్ అయ్యి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో పెళ్లి చేసుకున్న రాజేంద్రప్రసాద్, దివ్యవాణి వేరే వేరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఆర్థిక ఇబ్బందులు తొల‌గించు కోవాల‌ని అనుకుని ఒకే సంస్థలో కలిసి ఉద్యోగం చేయాలని అనుకుంటారు.


ఆ సంస్థలో చేరేందుకు తాము అవివాహితులం అని ... తమకు పెళ్లి కాలేదని ఆ సంస్థ యజమాని గుమ్మడికి అబద్దం చెప్తారు. అక్కడ నుంచి వీరిద్దరు ఎదుర్కొనే సమస్యలే ఈ సినిమా. కంపెనీ యజమానిగా గుమ్మడి వెంకటేశ్వరరావు.. అలాగే ఈ సినిమాకు కథను అందించిన రావి కొండలరావు, శుభలేఖ సుధాకర్ కామెడీ ఇవన్నీ అదిరిపోయాయి. సెకండ్ హీరోయిన్ గా గుమ్మడి కుమార్తె.. వసుంధర పాత్రలో నటించిన సింధుజ కూడా హీరో రాజేంద్రప్రసాద్ వెంట పడటం బాగుంది.


ఆరుద్ర చేత నుంచి జాలువారిన శ్రీర‌స్తు శుభమస్తు పాట. అప్పటివరకు తెలుగు నాట ఎక్కడ పెళ్ళి జరిగిన వినిపించే సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అనే పాటను పక్కకు నెట్టేసింది. ఇప్పటికీ తెలుగు వారి పెళ్ళిల్లో శ్రీరస్తు.. శుభమస్తు.. పాట వినిపిస్తుంది. ఏది ఏమైనా పెళ్లికి అర్ధాన్ని, పరమార్ధాన్ని సున్నితంగా మనసుకు హత్తుకునేలా అందంగా, రొమాంటిక్గా అన్నింటిని మించి హాస్య భరితంగా చెప్పిన గొప్ప సినిమాగా.. పెళ్లి పుస్తకం తెలుగు సినిమా చరిత్రలోనే కాదు తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: