తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ప్రేమకథ చిత్రాలు వచ్చాయి, వస్తున్నాయి. అయితే కొన్ని ప్రేమకధా చిత్రాలు మాత్రమే వెండితెరపై సంచలనం సృష్టించాయి. అందులో ప్రేమ ఖైదీ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఈ సినిమా కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో సెన్సెషన్ క్రియేట్ చేసిన హీరో హరీష్ కుమార్. ఈ చిత్రంలో హీరోగా నటించిన హరీష్ కు ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి.
ఈ క్రమంలోనే 'ప్రేమకానుక', 'ప్రేమాభిషేకం', 'పెళ్లాం చెబితే వినాలి', 'రౌడీ ఇన్స్పెక్టర్', 'కాలేజీ బుల్లోడు', 'ప్రేమ విజేత', 'ప్రాణదాత', 'మనవరాలి పెళ్లి', 'బంగారు కుటంబం' వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అయితే హరీష్ హీరోగానే కాకుండా చైల్డ్ ఆర్టిస్టుగా కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించగా 'ఒహో నా పెళ్లంట' అనే సినిమాకు బాలనటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీలో కూడా ఈ హీరో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక హరీష్ కు అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ కూడా కాస్త ఎక్కువగానే ఉండేది. అయితే వరుస హిట్ చిత్రాల్లో వెండితెరపై సందడి చేసిన ఈ హీరో మెల్లగా వెండితెరకు దూరమయ్యాడు.
ప్రస్తుతం హరీష్ తన కుటుంబంతో కలిసి ముంబయిలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. 2021 డిసెంబర్లో హైదరాబాద్ లో జరిగిన సంతోషం అవార్డ్స్ వేడుకలో కనిపించిన ఈ హీరో అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా లేరని తెలుస్తోంది. ఇక ముంబయిలో ఈ హీరో వ్యాపార రంగంలో స్థిరపడినట్టు కూడా తెలుస్తోంది. ఇక వైవాహిక జీవితంలోకి హరీష్ అడుగుపెట్టాక సినిమాలకు కావాలనే దూరం జరిగినట్టు అయన సన్నిహితులు చెబుతున్నారు. అలనాటి సీనియర్ నటుడు శోభన్ బాబు వలే హరీష్ కూడా సినిమాలకు కావాలనే టాటా చెప్పినట్టు, ఆ తరువాత తమ పిల్లలకు కూడా సినిమా రంగంలోకి వస్తామంటే, వద్దని చెప్పినట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా పరుగు ఆపడం కొద్ది మంది హీరోలకే సాధ్యపడుతుంది. అందులో హీరో హరీష్ ఒకరు.