సీనియర్ హీరో నాగార్జున గురించి చెప్పనవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నాడు. ముఖ్యంగా మన్మధుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగార్జున కేవలం కమర్షియల్ సినిమాల్లోనే కాకుండా భక్తి సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నాడు. ఈయనలోని నటుడిని వెలికి తీసిన దర్శకుడు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వంలో అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ వంటి సినిమాల్లో నాగార్జున నటించారు. షిరిడి సాయి సినిమాలో సాయిబాబాగా పాత్రను పోషించారు.


మిగిలిన సినిమాల్లో భక్తుడిగా నటించి మెప్పించారు. అప్పటి వరకు నాగార్జున అంటే కేవలం లవ్ అండ్ యాక్షన్ కమర్షియల్ సినిమాల వరకు మాత్రమే హీరోగా చేసేవారు. కానీ అన్నమయ్య సినిమాతో రాఘవేంద్రరావు నాగార్జున ఇమేజ్ ను పూర్తిగా మార్చేశాడు. కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విఎంసి దొరస్వామి రాజు చేసిన ప్రయత్నం అన్నమయ్య సినిమాగా రూపొంది జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. అన్నమయ్యగా నటించిన నాగార్జున ఈ నాటికి ఆ పేరు వినగానే జనాలకు గుర్తుకు వచ్చేలా నటించారు.


అన్నమయ్య జయంతి అయిన మే 22వ తేదీన 1997లో ఈ సినిమా ప్రేక్షకుల ముందు నిలబడింది. నాగార్జున అన్నమయ్యగా నటించిన ఈ సినిమాలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ నటించారు. అన్నమయ్య భార్యలు తిమ్మక్క, అక్కలమ్మలుగా రమ్యకృష్ణ, కస్తూరి నటించారు. అన్నమయ్య సినిమా మొదటివారం ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేదు. అనంతరం ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా 40 కేంద్రాలలో శత దినోత్సవం చూసింది. రెండు కేంద్రాలలో రజతోత్సవం ప్రదర్శితమైంది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు లభించింది.


నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమా పలు కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకుంది. అంతేకాకుండా హైదరాబాద్ దేవి 70ఎంఎం థియేటర్స్ లో కూడా సిల్వర్ జూబ్లీ పూర్తిచేసుకుంది. ఈ సినిమా అన్నమయ్య జయంతి రోజున విడుదలైంది. అటు ఈ సినిమాలో అన్నమయ్య పాత్రధారి నాగార్జున పుట్టినరోజు అయిన ఆగస్టు 29న ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: