ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, శుభలేఖ సుధాకర్, విజయకుమార్, బాబు మోహన్, గిరిబాబు తదితరులు కీలకపాత్రలను పోషించారు. చందమామ విజయ కంబైన్స్ పై బి. వెంకటరామిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఏకంగా 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటసింహ నందమూరి బాలకృష్ణ ఒక తెగలో ఎదుగుతున్న రాకుమారుడు విజయ్ గా ధైర్య సాహసాలు కలిగిన వీరుడుగా ప్రేక్షకులకు కనిపిస్తాడు.
విజయ్ కార్తికేయ రాజ్యానికి చెందిన యువరాణి పద్మావతి తో ప్రేమలో పడతాడు. (యువరాణి పద్మావతి పాత్రలో నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా నటించింది.) ఒక అదృష్ట మాంత్రికుడు పద్మావతిని బలి ఇవ్వడానికి భైరవద్వీపం అనే ద్వీపానికి మాయాజ్వాలం ద్వారా తీసుకొని వెళ్తాడు. విజయ్ చెడుతో పోరాడి యువరాణిని ఎలా కాపాడతాడు అనేది సినిమా కథ. గొప్ప మలుపులతో, అద్భుతమైన దృశ్యాలతో కూడిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు మాధవ పెద్ది సురేష్ సంగీతం అందించారు.
ఇందులో ఆరు పాటలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పాటల కోసం ఏకంగా మూడు నెలల పాటు షూటింగ్ కోసం సమయాన్ని కేటాయించారట. కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలలోని చిన్న చిన్న ఊర్లలోను బైరవద్వీపం సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. మొత్తం మీద 50 కేంద్రాలలో ఈ సినిమా శత దినోత్సవం జరుపుకుంది. రజతోత్సవాన్ని మద్రాసులోని విజయా-శేషమహాల్లో జరిపారు.