ప్రముఖ నటి, చంద్రముఖి ఫేమ్ జ్యోతిక, తాజాగా విడుదలైన "అమరన్" సినిమాను చూసి ఎంతో ఆనందించారట. ఈ సినిమాలో సాయి పల్లవి నటన అద్భుతంగా ఉందని, తమిళ సినిమాకు ఇది ఒక 'రత్నం' లాంటిదని ఆమె ప్రశంసలు కురిపించారు. "జై భీమ్" లాంటి మంచి సినిమాలతో పోల్చదగిన సినిమా ఇదని జ్యోతికా అభిప్రాయపడ్డారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టి మరీ ఈ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి కూడా ఈ పోస్ట్ కి రియాక్ట్ అయింది.

ఈ సినిమాలో సాయి పల్లవి నటన అద్భుతంగా ఉందని, ముఖ్యంగా చివరి పది నిమిషాలు తనను ఎంతగానో కదిలించాయని జ్యోతిక ఇన్‌స్టా పోస్టులో చెప్పుకొచ్చింది. "సాయి పల్లవి, నువ్వు ఎంత గొప్ప నటివి! చివరి పది నిమిషాల్లో నా గుండెను, ఊపిరిని ఆపుచేశావు. నీపై నాకు ఎంతో గర్వంగా ఉంది" అని జ్యోతిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా, ఈ సినిమా హీరో శివ కార్తికేయన్ కూడా తన పాత్రకు ఎంతో కష్టపడ్డాడని, అతని కృషికి ఆమె అభినందనలు తెలిపారు.

"అమరన్" సినిమా ద్వారా మేజర్ ముకుంద వరదరాజన్‌ జీవిత కథను అద్భుతమైన విష కావ్యం లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకుగాను జ్యోతిక ఎంతగానో సంతోషించారు. ఆయన భార్య ఇందు రెబెక్కా వర్గీస్‌ను ఉద్దేశించి, "మీ త్యాగం, సానుకూల ఆలోచన మా హృదయాలను తాకింది, మా ఆత్మలను ప్రకాశవంతం చేసింది" అని తెలిపారు. అంతేకాకుండా, "మేజర్ ముకుంద వరదరాజన్‌ గారు, మీ ధైర్యసాహసాలను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుంటారు. మేము మా పిల్లలను మీలాంటి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాము" అని కూడా ఆమె అన్నారు.

"అమరన్" సినిమాను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని, ఇది భారతీయ సైన్యానికి అంకితమైన ఒక అద్భుతమైన చిత్రమని జ్యోతిక అన్నారు. ఈ మాటలకు సంతోషించిన సాయి పల్లవి, "మీరు ఈ సినిమా చూస్తున్నారని తెలిసి నేను ఎంతో థ్రిల్‌గా ఫీల్ అయ్యా. ఎగ్జైటింగ్‌గా అనిపించింది. మీరేం చెప్తారా అని ఆందోళనగా కూడా అనిపించింది. మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది." అని జ్యోతికకు రిప్లై ఇచ్చింది. దీనికి ప్రతిస్పందిస్తూ జ్యోతిక "నీకు నేను ఎప్పుడూ ఫ్యాన్‌గా ఉంటాను. నువ్వు నాకు ఎంతో స్పెషల్. నీవు ఎంత అద్భుతంగా నటిస్తావు! నీ పాత్రలను ఎంత జాగ్రత్తగా ఎంచుకుంటావు! ఇలాగే ఎదగండి. భగవంతుడు నీకు మంచి చేయాలి." అని సాయి పల్లవిని అభినందించారు. వీరిద్దరి క్యూట్ కన్వర్జేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: