ఇప్పట్లో అయితే ఒక సినిమా రిలీజ్ అయింది అంటే ఎన్ని వందల కోట్లు రాబట్టింది అన్నది చూస్తున్నారు. కానీ ఎన్ని రోజులపాటు థియేటర్లో ఆడింది అన్నది అసలు పట్టించుకోవట్లేదు. ఒకప్పుడైతే సినిమా 100 రోజులు 150 రోజులు ఆడింది అంటే సూపర్ హిట్ అని భావించేవారు. అయితే ఇలా 500 రోజులు ఆడిన చిరంజీవి మూవీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆ సినిమా ఏదో కాదు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా. 1982 ఏప్రిల్ 23వ తేదీన వేసవి బరిలో నిలిచింది ఈ మూవీ.



 అప్పటివరకు దాసరి శిష్యుడిగా కొనసాగిన కోడి రామకృష్ణ తొలిసారి ఈ మూవీతో దర్శకుడి అవతారం ఎత్తాడు. అంతేకాదు మాటల రచయితగా ఉన్న గొల్లపూడి మారుతీరావు నటుడిగా తొలిసారి ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే అప్పట్లో కేవలం 29 రోజుల్లోనే కోడి రామకృష్ణ మూడు లక్షల ఇరవై వేల వ్యయంతో ఈ సినిమాను నిర్మించారట. పాలకొల్లు, నరసాపురం, పోడూరు,సఖినేటిపల్లి, భీమవరం, మద్రాసులలో సినిమా షూటింగ్స్ ని జరిపారట. సినిమా పూర్తయ్యాక సెన్సార్ బోర్డు నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఇక ప్రొడ్యూసర్ కే రాఘవ పట్టుదలతో పోరాడి సెన్సార్ ఇబ్బందుల నుంచి బయటపడి చివరికి సినిమాను విడుదల చేశారు.



 సినిమా విడుదలైన తర్వాత మొదట యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. కానీ ఆ తర్వాత కాలంలో ఈ మూవీకి ప్రేక్షకాధరణ అంతకంతకు పెరుగుతూ వచ్చి.. సూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా 8 కేంద్రాలలో 50 రోజులు కొన్ని కేంద్రాలలో వంద రోజులు ఆడి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక హైదరాబాద్ సిటీలో ఈ సినిమా ఏకంగా 512 వ రోజు వరకు ఆడింది. అప్పటికే యాక్షన్ హీరో ఇమేజ్ ఉన్న చిరంజీవి ఇక ఈ మూవీలో హాస్యం మేలవించిన ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో నటించడంతో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక చిరంజీవికి కూడా నటనలో ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: