80ల దశకంలో తెలుగు సినీ పరిశ్రమలో సుమన్ ఒక అగ్ర తారగా వెలిగారు. చిరంజీవితో పోటీ పడేంతటి ప్రజాదరణను సంపాదించుకున్నారు. యాక్షన్ సినిమాలతో పాటు కుటుంబ కథా చిత్రాలలో కూడా ఆయన నటనకు మంచి ఆదరణ లభించింది. తరంగిణి సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిన సుమన్ తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. కానీ, సుమన్ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగింది. బ్లూ ఫిలిమ్స్ తీస్తున్నారనే ఆరోపణలతో ఆయనను జైలుకు పంపించారు. తనపై రాజకీయ కుట్ర జరిగిందని ఆయనే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రెండేళ్ళు జైలులో గడిపిన సుమన్ ఆ కాలంలో మానసికంగా చాలా కష్టపడ్డారు. అయితే, ఆయనపై ఉన్న అన్ని ఆరోపణల నుంచి తొలగించబడ్డారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సుమన్ జీవితం మరో మలుపు తిరిగింది. ప్రముఖ రచయిత బసవరాజు మనవరాలు శిరీషను పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం సినీ వర్గాల్లో చాలా చర్చనీయాంశమైంది. బసవరాజు సుమన్ నిర్దోషి అని నమ్మి తన మనవరాలు నిచ్చి పెళ్లి చేశారు. వివాహం తర్వాత సుమన్ తన సినీ జీవితాన్ని మరోసారి ప్రారంభించి బావ బావ మరిది, మొండి మొగుడు పెంకీ పెళ్ళాం, పెద్దింటి అల్లుడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇంటర్వ్యూలలో సుమన్ తన భార్యే తనకు సినీ రంగంలో మళ్లీ గౌరవం తెచ్చిపెట్టిందని, తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టిందని చెప్పారు.