•సినిమా పేరుని ఇంటిపేరుగా మార్చుకున్న ఆహుతి ప్రసాద్..

•సెకండ్ ఇన్నింగ్స్ లో నంది అవార్డులతో సరికొత్త సంచలనం..

•కమెడియన్ గానే కాదు విలన్ కూడా..

సినీ పరిశ్రమలో ఎందరో మహానుభావులు.. అందరూ కనిపించింది సినిమా ఇండస్ట్రీలోనే అయినా.. ఒక్కొక్కరిది ఒక్కోదారి..ఒకరు కడుపుబ్బా నవ్విస్తే, మరొకరు గుండెలు అవిసేలా ఏడిపిస్తారు.  ఇంకొకరు రౌద్రంతో కోపాన్ని తెప్పిస్తారు. ఇంకొంతమంది విలనిజంతో మనలో కొత్త శత్రువుని పుట్టించేలా చేస్తారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కోదారి. అయితే అందరి ధ్యేయం ఆడియన్స్ ను ఆకట్టుకొని, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే. కుటుంబాలను కూడా పక్కనపెట్టి ఆరోగ్య పరిస్థితులను కూడా అధిగమించి అభిమానులకు వినోదాన్ని పంచడానికి ముందుకు వచ్చిన గొప్ప నటులలో ఆహుతి ప్రసాదు కూడా ఒకరు.

దాదాపు నాలుగు ఏళ్ళు క్యాన్సర్ తో పోరాడి, అయినా సరే అభిమానులను డిసప్పాయింట్ చేయకూడదని, తన బాధను ఎవరికీ చెప్పకుండా ఒకవైపు బాధ అనుభవిస్తూనే.. మరొకవైపు ప్రేక్షకులను నవ్వించిన గొప్ప మహానుభావుడు. వినీలా ఆకాశంలో తనకంటూ ఒక గుర్తింపున సొంతం చేసుకున్న ఆహుతి ప్రసాద్ 2015 జనవరి 5వ తేదీన పరమపదించి అందరిని కంటతడి పెట్టించారు. దాదాపు 122 చిత్రాలలో నటించిన ఈయన విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆహుతి సినిమా పేరుని తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన పూర్తి పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్.

కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం కోడూరులో 1958 జనవరి 2న ఉపాధ్యాయుడైన రంగారావు, హైమావతి దంపతులకు జన్మించారు. ఈయన కుటుంబం కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లింది. సినిమాలంటే ఇష్టం ఉన్న ఆహుతి ప్రసాద్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. సినిమాల్లోకి రావాలనుకున్న ఈయన హైదరాబాదులోని మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ తీసుకొని కొంతకాలం దేవదాసు దగ్గర యాక్టింగ్ స్కూల్ కి  ఇన్చార్జి గా కూడా పనిచేశారు. ఇకపోతే నాగార్జున తొలి చిత్రం అయినా విక్రమ్ సినిమాతో పరిచయమయ్యారు ప్రసాద్. ఇక ఆహుతి సినిమాతో వెనుతిరిగి చూడలేదు. 2007లో వచ్చిన చందమామ సినిమాతో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా అందుకున్నారు. అంతే కాదు ఉత్తమ విలన్ గా కూడా నంది అవార్డులు అందుకున్న ఘనత ఈయన సొంతం. చివరి వరకు నవ్వించి 57 ఏళ్ల వయసులో స్వర్గస్తులయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: