- గర్భిణిగా ఉన్నప్పుడు ‘నదియా కే పార్’ చిత్రం కోసం ‘కోన్ దిశా మే లేకే చలా రే బతూహియా’ పాట పాడిన హేమలత
విఖ్యాత నేపథ్య గాయని హేమలత జీవిత చరిత్ర ‘దాస్తాన్ – ఎ – హేమలత’ పుస్తకం దిల్లీలో ఆవిష్కరించారు.
ఆజ్‌తక్ నిర్వహించిన ‘సాహిత్య’ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ జర్నలిస్ట్, బయోగ్రాఫర్ డాక్టర్ అరవింద్ యాదవ్ రాసిన ఈ పుస్తకంలో హేమలత జీవితంలో అత్యంత సన్నిహితులకు కూడా తెలియని అనేక అంశాలను పొందుపరిచారు. హేమలత తండ్రి పండిట్ జయ్‌చంద్ భట్ గురించి కూడా ఈ పుస్తకంలో ఉంది.
ముఖ్యంగా సంగీత, సాహిత్యాలంటే ఇష్టపడేవారు నచ్చే, మెచ్చే ఎన్నో అంశాల సమాహారమే ఈ పుస్తకం.
13 ఏళ్ల వయసులోనే తన తొలి పాటను రికార్డ్ చేసిన హేమలత తన కెరీర్‌లో 38 భాషల్లో పాటలు పాడారు.
హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తెలుగు, తమిళం, ఒడియా, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, ప్రాకృతం వంటి ప్రధాన భాషల్లోనే కాకుండా భోజ్‌పురి, బ్రజ్, మార్వారీ, అవధీ, బుందేలి, మైథిలి, డోగ్రీ, కశ్మీరీ, కొంకణి, హరియాణ్వీ, నేపాలీ, గార్వాలీ, కుమావీ, చంబయాలీ, బిలాస్‌పురి వంటి అనేక స్థానిక భాషల్లోనూ పాటలు పాడారు. వీటితో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, డచ్, జులు, మారిషస్ క్రియోల్, సిరాయికి, ముల్తానీ భాషల్లోనూ పాటలు పాడడం విశేషం. ప్రేమ గీతాలు, విరహ గీతాలు, విషాద గీతాలు, ఆధ్యాత్మిక గీతాలు, భావ గీతాలు, జానపద గీతాలు, గజల్స్ ఒకటేమిటి అన్ని రకాల పాటలూ ఆమె గాత్రం నుంచి జాలువారాయి. హిందీలో ఆమె ఏసుదాసుతో కలిసి పాడిన పాటలు సూపర్‌హిట్‌లు.
నిండు గర్భిణిగా ఉంటూ హిట్ సాంగ్ ...
9 నెలల గర్భంతో ఉన్నప్పుడు కూడా పాటలు పాడిన ఏకైక గాయనిగా ఆమె రికార్డ్ సృష్టించారు. నదియా కే పార్ చిత్రం కోసం ఆమె తాను 9 నెలల గర్భంతో ఉన్నప్పటికీ ‘కోన్ దిశా మే లే కే చలా రే బతూహియా’ అనే పాట పాడారు. ఆ పాట హిందీ సినీ సాహిత్యంలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆ పాట పాడే సమయానికి డాక్టర్లు ఆమెకు ఇచ్చిన డెలివరీ డేట్ కూడా దాటిపోయింది.
జీవిత కథల స్పెషలిస్ట్ అరవింద్ యాదవ్
ఇక రచయిత అరవింద్ యాదవ్ విషయానికొస్తే సుమారు 3 దశాబ్దాల జర్నలిజం కెరీర్ ఆయనది. 1996లో హిందీ మిలాప్ వార్తాపత్రికలో జర్నలిస్ట్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఆజ్ తక్, చానల్ 7, ఐబీఎన్ 7 వంటి చానళ్లలో రిపోర్టర్‌గా పనిచేశారు. 2008లో సాక్షి చానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన అనంతరం టీవీ9 చానల్ ఎడిటర్‌గానూ పనిచేశారు. అనంతరం ‘యువర్ స్టోరీ’ వెబ్‌సైట్ మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశారు.
హైదరాబాద్‌లోనే పుట్టిన పెరిగిన అరవింద్ యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశారు. చాలాకాలంగా ఆయన విజయవంతమైన, స్ఫూర్తిదాయకమైన దిగ్గజాల జీవిత కథలనూ రాస్తున్నారు.