విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు న‌ట విశ్వ‌రూపం చూపించిన సినిమా దాన‌వీర‌శూర‌కర్ణ. తెలుగు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో ఎప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర‌ని ఎన్నో అనిత‌ర సాధ్య‌మైన రికార్డులు ఈ సినిమా సొంతం. అస‌లు ఈ సినిమా ప్రారంభం నుంచి.. షూటింగ్‌.. రిలీజ్‌.. ఆ త‌ర్వాత రికార్డులు అన్ని కూడా ఓ సంచ‌ల‌న‌మే. అస‌లు ఈ సినిమాపై ముందు ఎవ్వ‌రికి పెద్ద అంచ‌నాలు లేవు. ఎన్టీఆర్‌ దర్శకత్వ పటిమ గురించి చెప్పడానికి ‘దాన వీర శూర కర్ణ’ ఒక్కటి చాలు. చలన చిత్ర చరిత్రలో ఏ సినిమాకీ దక్కని ఖ్యాతి... ‘దాన వీర శూర కర్ణ’  సొంతం చేసుకొంది .


మూడు పాత్రలు ఒకే నటుడు పోషిస్తూ, దర్శకత్వం వహించడం, అందులోనూ పౌరాణిక గాథ కావడం... న భూతో న భవిష్యత్‌! 3 గంటల 46 నిమిషాల సుదీర్ఘ చిత్రమిది. ఇప్పటి తరమైతే... రెండు భాగాలుగా మార్చి విడుదల చేసేవారు. ‘ఇంత పెద్ద సినిమా ఎవరు చూస్తారండీ..’ అనే కామెంట్లనీ ఎదురొడ్డి... ఈ చిత్రాన్ని ఉన్నది ఉన్నట్టు దైర్యంగా రిలీజ్‌ చేశారు ఎన్టీఆర్ .. ఇంత సుదీర్ఘమైన చిత్రాన్ని నిర్మించడానికి ఎన్టీఆర్‌ తీసుకొన్న సమయం 43 రోజులు మాత్రమే. విడుదల తేదీ సమీపిస్తున్నందు వల్ల చివరి మూడు రోజులూ రాత్రింబవళ్లూ కష్టపడ్డారు. ఈ సినిమాలో నటరత్న ఎన్టీఆర్ తో పాటు ఆయన కొడుకులు హరికృష్ణ , బాలకృష్ణ కూడా నటించారు ..


హరికృష్ణ ఈ సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపిస్తారు.. నట సింహం బాలకృష్ణ అర్జునుడి కొడుకు అభిమన్యుడు పాత్రలో నటించారు. కురుక్షేత్రంలో పద్మ వ్యూహల్లో మరణించే అభిమన్యుడి పాత్రలో బాలయ్య నటన నభూతో న భవిష్యత్తు. అలా అభిమన్యుడు పాత్రల్లో నటించి బాలకృష్ణ దానవీరశూరకర్ణ సినిమాకి హైలెట్గా నిలిచారు.కేవలం రూ.10 లక్షల్లో ఈ చిత్ర నిర్మాణం పూర్తయిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1977 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అనూహ్యమైన విజయం సాధించింది. ఏకంగా రూ.కోటి వసూలు చేసింది. ‘లవకుశ’   తరవాత కోటి రూపాయలు వసూలు చేసిన తెలుగు చిత్రమిదే. ఈ చిత్రం విడుదలై యాభై ఏళ్ల కావొస్తోంది. టెక్నాలజీ ఇంత పెరిగినా, ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్నా.. ఎవ్వరూ ఇంతటి ప్రయోగానికీ సాహసానికి పూనుకోలేకపోయారు. దటీజ్‌... ఎన్టీఆర్‌. దటీజ్‌ ‘దాన వీర శూర కర్ణ’

మరింత సమాచారం తెలుసుకోండి: