అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప : ది రూల్ సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ భాషలలో ఎన్నో అంచనాల నడుమ విడుదలై రికార్డులు కొల్లగొడుతోంది. పుష్ప : ది రూల్ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో దాదాపు హౌస్ ఫుల్ షోలతో విజయవంతంగా దూసుకెళ్తోంది.


అయితే హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. అక్కడికి అల్లు అర్జున్ రావడంతో అతడిని చూడడానికి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి కొత్తగా విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్ షోలకు అనుమతించమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనౌన్స్ చేశారు.


ఈ నేపథ్యంలో ఇకపై తెలంగాణలో ఉదయం 7 గంటలకే తొలి షో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సినిమాలపై ప్రభావం పడే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. కాగా, జనవరి 10వ తేదీన రామ్ చరణ్ హీరోగా చేసిన "గేమ్ చేంజర్" సినిమా విడుదల కానుంది. జనవరి 14న వెంకటేష్ "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


జనవరి 12న బాలకృష్ణ హీరోగా చేసిన "డాకు మహారాజు" సినిమా విడుదల కానుంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా భారీ బడ్జెట్ తో విడుదలకు సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో రాబోయే కొత్త సినిమాల మీద ప్రభావం భారీగా పడే అవకాశాలు ఉన్నాయని సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి కానుకగా రాబోయే ఈ మూడు సినిమాలకు కచ్చితంగా ఎదురుదెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: