దాన‌వీర శూర‌క‌ర్ణ సినిమా చ‌రిత్ర‌లో ఎప్ప‌ట‌కీ మ‌రువ‌లేం. 1976 జుాన్ 7వ తేదిన రామకృష్ణ సినీ స్టుాడియో   ప్రారంభించిన తరువాత నిర్మించిన మెుదటి చిత్రం. హేతువాది కొండవీటి వెంకటకవి దాన వీర శూర కర్ణ సినిమాకు మాటలు సమకూర్చారు.మహాభారతంలో కర్ణుడి పాత్ర ఉదాత్తమైనది.ఆ పాత్ర ఔచిత్యాన్ని,గొప్పతనాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తీర్చిదిద్దారు రామారావు గారు. సుయోధనుడుగా మరోసారి తనకు తానే సాటి అని ఎన్టీఆర్ నిరూపించారు.ముఖ్యంగా విలువిద్యా ప్రదర్శననలో కర్ణుడి పుట్టుకను ప్రశ్నించి అతన్ని అవమానించిన వారి జన్మ రహస్యాలనే కాక తన జన్మ వృత్తాంతాన్ని కూడా బయటపెట్టి అందరిని ఎండగట్టిన సన్నివేశంలో రామారావు గారి  హావభావాలు,మాట విరుపులూ అనన్యసామాన్యం. 'ఏమంటివి, ఏమంటివి?' అనే ప్రశ్నతో ప్రారంభించి. అద్భుతమైన స్వరభేదాలను ప్రదర్శిస్తూ రామారావు గారు పలికిన సుదీర్ఘ ప్రబోధాత్మక డైలాగులు ఆడియో క్యాసెట్లు కొన్ని లక్షలు అమ్ముడుపోయాయి.


సినిమా నాలుగు దశాబ్దాల క్రిందట రూపొందించినా గానీ సోషల్ మీడియాలో,టెలివిజన్లో నేటికీ అత్యధికంగా వీక్షిస్తున్న సన్నివేశాలు,వింటున్న డైలాగులు ఇందులోనివే అంటే అతిశయోక్తి కాదేమో.
దాన వీర శూర కర్ణ చిత్రం షూటింగ్ 43 రోజులు జరిగింది.ఆ సమయంలో ఆయన తెరపైనే కాకుండా తెరవెనుక కూడా అనేక పాత్రలు పోషించారు. చిత్రంలో మేకప్ కోసం వేసుకున్న గ్రీజ్ పెయింట్ తొలగించుకోవడానికే రోజూ రెండు గంటలు పట్టేది. సుయోధనుని పాత్రకోసం ప్రతిరోజూ ఉదయాన్నే సెట్టుకు వచ్చినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయిన తరువాత ప్యాకప్ చెప్పేవరకు ఆయన మూడు కిలోల బరువైన కిరీటం అలాగే ధరించేవారు.రామారావు గారు కష్టజీవి,ఒక తపస్వి. అంత కీర్తి,ధనం,ప్రజాభిమానం సముపార్జించుకున్నా,పనిదగ్గరకు వచ్చేసరికి పనివాడుగానే భావించి అహర్నిశలూ శ్రమించేవారు.


దాన వీర శూర కర్ణ సెట్లపై ఎడతెరిపిలేకుండా షూటింగ్ జరుగుతున్నప్పటికీ వాతావరణం ప్రశాంతంగా ఉండేది. రామారావు ఒక పద్ధతి ప్రకారం చాలా వేగంగా సినిమాలు తీస్తారని పేరు గడించారు.ప్రత్యేకించి ఈ సినిమా విషయంలో ఆయన అవిశ్రాంతంగా పనిచేసి తనను తాను హింసించుకున్నారు.ఒకదశలో ఈ సినిమా షూటింగ్ నిరంతరాయంగా 72 గంటలపాటు కొనసాగింది. ఆయన ప్రతిరోజూ రషెస్ చూసేవారు కాదు. చిత్రం షూటింగు అయిపోయిన తరువాత ఎడిటింగ్ టేబిల్పై మాత్రమే చిత్రాన్ని చూసుకునేవారు. ఒకే ఒక వ్యక్తి బహుపాత్రలు ధరిస్తూ తెరవెనుక కూడా అనేక పాత్రలు పోషిస్తూ కేవలం 43 రోజుల్లో ఈ సినిమా రూపొందించారంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1977 జనవరి 14న విడుదలైన దాన వీర శూర కర్ణ సినిమా ఘనవిజయం సాధించింది.లవకుశ కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రం కాగా దాన వీర శూర కర్ణ సినిమా రెండు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.ఈ సినిమా పెట్టుబడి సుమారు పది లక్షలు మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: