వైసీపీ పగ్గాలను విజయమ్మకు ఇవ్వాలని పద్మ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జగన్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని, మహానేత వైఎస్ పేరును కూడా చెడగొడుతున్నాడని.. ఆయన మొహం చూసి తాము పార్టీలో చేరామని.. ఇలా పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం పార్టీ బతికి ఉండాలంటే.. పగ్గాలను విజయమ్మకు అప్పగించాలన్నది పద్మ డిమాండ్. దీంతో నిజంగానేవైసీపీని విజయమ్మ చేపడితే.. ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. సహజంగా ఇది జరిగేది కాకపోయినా.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.
కాబట్టి.. విజయమ్మ ఎందుకు వైసీపీ పగ్గాలు చేపట్టరాదన్నది రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తున్న మాట. ప్రస్తుతం జగన్‌పై కేసుల విచారణ పుంజుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో వచ్చే రెండేళ్లలో ఏమైనా జరగొచ్చు. అప్పుడైనా విజయమ్మకు అప్పగిస్తే బెటర్ అనే చర్చ ఉంది. గతంలో పార్టీ పెట్టినప్పుడు గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ వ్యవహరించారు. అయితే.. కుమార్తె షర్మిల సొంత పార్టీ పెట్టుకున్నదరిమిలా.. విజయమ్మ.. గౌరవ అధ్యక్షురాలి పదవిని వదులుకున్నారు.
ప్రస్తుతం విజయమ్మ రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. అయినప్పటికీ.. ఆమె పార్టీ పగ్గాలు చేపడితే ఎంతో కొంత పుంజుకునేందుకు అవకాశం ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వెళ్లిపోతున్న నాయకులను కట్టడి చేయడంలోనూ.. ప్రజల్లో పోగొట్టుకున్న సింపతీని తిరిగి దక్కించుకునేందుకు విజయమ్మ కరెక్ట్ అని అంటున్నారు. కానీ, దీనిని వైసీపీ నాయకులు కొట్టి పారేస్తున్నారు.
జగన్ ఇమేజ్‌ను డైల్యూట్ చేసేందుకు పద్మ వేసిన పాచికగా చెబుతున్నారు. వైసీపీలో ఉన్నవారు జగన్ నాయకత్వాన్ని .. తర్వాత.. భారతి నాయకత్వాన్ని కోరుకుంటారని.. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. కానీ.. రాజకీయంగా దీనిపై చర్చ అయితే సాగుతుండ డం గమనార్హం. మరి ఏం చేస్తారో చూడాలి.