హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అభిమానులంతా పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. దీంతో రేవతి ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు గాయాలపాలయ్యాడు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పటికే పోలీసులు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. ఆయనపై 118 (1) బీఎన్ఎస్ 105, రెడ్ విత్ 35 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని థియేటర్ యాజమాన్యం భాగస్వాములు ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు కొట్టేయాలని అల్లు అర్జున్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ఠ అని అభిప్రాయపడ్డారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు నిజంగా సానుభూతి ఉందని కానీ నిజంగా ఎవరు విఫలం అయ్యారు అని కేటీఆర్ ప్రశ్నించారు. అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని ఓ సాధారణ నేరస్థుడిలా భావించి ఇలా చేయవద్దని అన్నారు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: