దేశంలోని ప్ర‌తి వ్య‌క్తికీ.. కొన్ని చ‌ట్టాలు ఉన్నాయి. అవి స్వేచ్ఛ కావొచ్చు.. వ్య‌క్తిగ‌త హ‌క్కులు కావొచ్చు. అదేవిధంగా సంస్థ‌ల‌కు కూడా చ‌ట్టాలు ఉన్నాయి. కానీ, లేనివ‌ల్లా.. మీడియాకు మాత్ర‌మే. ఈ నేప‌థ్యంలో నే 1950ల‌లోనే సుప్రీంకోర్టు కొన్ని సంచ‌ల‌న తీర్పులు ఇచ్చింది. ఆర్టికల్ 14 ప్ర‌కారం.. భావ ప్ర‌క‌ట‌నా స్వే చ్ఛ ప‌త్రికా రంగానికి కూడా వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. క‌ర్ణాట‌క వ‌ర్సెస్ మోహినీ జైన్ కేసులో సుప్రీంకో ర్టు ఈ తీర్పును ఇచ్చింది. ఆర్టిక‌ల్ 14 మీడియా రంగానికి వ‌ర్తిస్తుంద‌ని తేల్చి చెప్పింది.


అంటే.. దీని ప్ర‌కారం భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ అనేది మీడియాకు వ‌ర్తించింది. అయితే.. ఇదేస‌మ‌యంలో 1995-97 మ‌ధ్య మ‌రో సంచ‌ల‌న తీర్పును కూడా సుప్రీంకోర్టు వెలువ‌రించింది. భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ ముసుగులో వ్య‌క్తుల గోప్య‌త‌కు(ప్రైవ‌సీ) మీడియా భంగం క‌లిగించ‌రాద‌న్న‌ది ఈ తీర్పు. ఇదే స‌మ‌యంలో ల‌క్ష్మ‌ణ రేఖ‌లు గీసుకోవాల‌ని కూడా సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. అంటే.. మీడియాకు స్వేచ్ఛ ఉన్న‌ప్ప టికీ.. అదేస‌మ‌యంలో వ్య‌క్తిగ‌త గోప్య‌త‌.. ఇత‌రుల విష‌యాల్లో జోక్యం అనేది మీడియాకు ఉండ‌రాద‌నేది స్ప‌ష్టం చేసిన‌ట్టు అయింది.


అయిన‌ప్ప‌టికీ.. దేశం లో మీడియా ల‌క్ష్మ‌ణ రేఖ‌లు గీసుకోవ‌డం కానీ.. త‌న‌ను తాను నియంత్రించుకోవ‌డం కానీ చేయ‌డం లేదు. సెన్సేష‌న్‌కు.. టీఆర్ పీ రేటింగుకు పాకులాడుతున్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది. తాజాగా వెలుగు చూసిన న‌టుడు మోహ‌న్‌బాబు కుటుంబ వ్య‌వ‌హారంలోనూ.. మీడియా ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చింది. మీడియాకు ఉన్న ప‌రిధుల‌ను గ‌మ‌నిస్తే.. వ్య‌క్తిగ‌త అంశాల‌ను సెన్సేష‌న‌ల్ చేయ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మోహ‌న్‌బాబు కుటుంబంలో తలెత్తిన ఆస్తుల వివాదానికి అత్య‌ధిక ప్రాధాన్యం ఇవ్వ‌డంతోపాటు.. దాడి చేయించుకునే వ‌ర‌కు మీడియా నాలుగు మెట్లు దిగిపోయింది.


నిజానికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే అంశాలు కూడా ఉన్నాయి. వాటిని వ‌దిలేసి.. మీడియా మోహ‌న్‌బాబు ఇంటి వ‌ద్ద ప‌డిగాపులు కాయ‌డం.. కేవ‌లం ఆ వార్త‌ల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా.. ల‌క్ష్మ‌ణ రేఖ‌లు దాటింద‌నే వాద‌న మేధావి వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న మాట‌. వార్త ఇవ్వ‌డం త‌ప్పుకాదు. కానీ, ఎంత వ‌రకు స్పందించాలో అంత వ‌ర‌కు స్పందిస్తే.. ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ, హ‌ద్దులు దాటి నందునే దాడుల వ‌ర‌కు తెచ్చుకుంద‌న్న చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికైనా మీడియా ల‌క్ష్మ‌ణ రేఖ‌లు నిర్మించుకుని దాని ప్ర‌కారం వ్య‌వ‌హ‌రిస్తే.. ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. కానీ, ఇది లేనంత కాలం వివాదాల‌కు కేరాఫ్‌గానే ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: