స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టేషన్‌కు తరలించి ఆపై నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి హుటాహుటిన 14 రోజుల రిమాండ్ పడేలా చేశారు. అయితే ఈ సమయం అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రేవతి మరణంతో అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదని, అలాంటప్పుడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటూ చాలామంది తమ గళం ఎత్తారు. అంతేకాదు ఆయన పట్ల ఎంతో సానుభూతి చూపించారు. కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది అని అనగానే అందరూ షాక్ అయ్యారు. ఇది అన్యాయం అంటూ ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, చిక్కడపల్లి పోలీసులు స్టేషన్‌కి వెళ్లి మరీ సింపతిని ప్రదర్శించారు.

ఇదంతా చూసిన చాలామంది కొన్ని లాజికల్ క్వశ్చన్స్ వేస్తున్నారు. బన్నీ సినిమా ప్రీమియర్ షో చూడ్డానికి తన ఫ్యామిలీతో కలిసి వెళ్లినప్పుడు, తొక్కిసలాట జరిగింది, అందులోనే ఒక మహిళ చనిపోయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు, భర్త ఆరోగ్యం అంత మాత్రమే, ఒక పిల్లోడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఈ ఘటనలో అసలైన బాధితులు వారే, వారిని ఇప్పటివరకు ఒక్క సినిమా సెలబ్రిటీ గానీ లేదంటే అభిమానులమని చెప్పుకునే వారు గానీ వెళ్లి పరామర్శించలేదు, కనీసం వారి పట్ల జాలి చూపించారా? ఒక్క సినిమా పెద్ద కూడా ఆ కుటుంబానికి మద్దతు ప్రకటించిన దాఖలాలు లేవు. వారి ప్రవర్తన ఇలా ఉండటానికి ప్రధాన కారణం ఒకటే. అదేంటంటే ఆమె ఓ సాధారణ మహిళ, బన్నీ మాత్రం ఇమేజ్ ఉన్న ఒక హీరో. ఆ మహిళ కుటుంబం ఏమైపోయినా ఎవరికీ బాధ ఉండదు. అసలు వారితో వీరికి ఎలాంటి లాభం ఉండదు. కానీ బన్నీ పట్ల వారు కనీసం మద్దతు చూపించాలి, ఎందుకంటే బన్నీకి ఇండస్ట్రీలో బాగా పేరు ఉంది. ఆయన వైపు మాట్లాడితే సినిమాలో ఏదో ఒక ఫేవర్ జరిగే అవకాశం ఉంటుంది, అందుకే సినిమా వాళ్ళందరి సపోర్టు బన్నీకే అని చాలామంది విశ్లేషణలు చేస్తున్నారు.

అంతేకాదు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఒక హీరో తన సినిమా చూడ్డానికి వచ్చి, తన ఫ్యాన్స్ తొక్కిసలాటలో చనిపోతే ఆమెకు జస్ట్ 25 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటాడా అని కూడా అడుగుతున్నారు. ఓ సాధారణ మహిళ ప్రాణానికి అతను కట్టిన ఖరీదు అంతేనా? అని మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. బన్నీ స్వయంగా ఆమె కుటుంబం వద్దకు వెళ్లి కోటి రూపాయలు ఇచ్చి ఉంటే ఇంత నెగెటివిటీ వచ్చి ఉండేది కాదని కూడా అభిప్రాయపడుతున్నారు. లాయర్లకు, కోర్టులకు కోట్లలో కుమ్మరించే బదులు  బాధితులకే రూ. 1 కోటి ఇస్తే అరెస్టులు, పేరు డామేజ్ కావడం వంటి ఇబ్బందులు ఏమీ రావు కదా అని లాజిక్ మాట్లాడుతున్నారు. కామన్ మ్యాన్ పట్ల ఎవరికి సింపతి ఉండదని, కామన్‌ మ్యాన్ ప్రాణం ఖరీదు ఎప్పుడూ తక్కువగానే ఉంటుందని మరోసారి ప్రూవ్ అయినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక సాయం, మద్దతులాంటివి అసలు ఆశించడమే తప్పు అని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: