ఈ సినిమాని ఏకంగా రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేశారు. విడుదలకు ముందు అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. నిర్మాతలు సైతం ఈ సినిమా రూ. 2,000 కోట్లు వసూలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ చివరికి, ఇది కేవలం రూ.100 కోట్లు రాబట్టడానికి కూడా కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ, సూర్యకు ఇప్పటికీ సౌత్ ఇండియాలో తన సత్తా చాటే సామర్థ్యం ఉంది, ముఖ్యంగా మంచి కథ దొరికితే అతడు ప్రభాస్, అల్లు అర్జున్ రేంజ్ లో ఈజీగా మంచి హిట్ కొట్టగలడు. సూర్య మంచి సినిమా తీయాలే గాని పెద్ద బ్రేక్ ఇవ్వడానికి కోట్ల సంఖ్యలో అభిమానులు రెడీగా ఉన్నారు. అయితే, తమిళ దర్శకులు మాత్రం ఆయన టాలెంట్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు.
దీంతో సూర్య ఇప్పుడు తమిళ సినిమాలకు విరామం ఇచ్చి, తెలుగు సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటున్నాడు. ధనుష్, దుల్కర్ సల్మాన్ వంటి నటులు ఇప్పటికే తెలుగు సినిమాల్లో విజయాలు సాధించడంతో, సూర్య వారి బాటలోనే నడుస్తున్నాడు. "సార్", "లక్కీ భాస్కర్" వంటి హిట్‌లతో పేరు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు విభిన్న జోనర్లలో సినిమాలు చేస్తున్న అట్లూరి, భారతదేశంలో మారుతి సుజుకి కారు గురించిన ఒక ప్రత్యేకమైన కథను రాశాడట. సూర్య ఈ కథ వినగానే నచ్చిందని సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది. సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు, అది వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆ సినిమా పూర్తయిన తర్వాత, వెంకీ అట్లూరితో ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని సూర్య యోచిస్తున్నాడు.