పోలీసుల నుండి అనుమతి లేకపోయినప్పటికీ హీరో రావడం చాలా దారుణమైన అంశంగా పరిగణించారు. ఎందుకంటే సంధ్య థియేటర్ కి ఒక్కటే దారి ఉంది కాబట్టి.. హీరో, హీరోయిన్ అనేవారిని రావొద్దని పోలీసులు చెప్పారు. కానీ వారు వచ్చారు. రావడమే కాకుండా... రోడ్డు షో చేసుకుంటూ హీరో రావడం వల్లనే అక్కడ తొక్కిసలాట జరిగి ఘోరం జరిగింది అంటూ దుయ్యబట్టారు. ఇంకా వచ్చిన వాడు కారులో వచ్చి సినిమా చూసి వెళ్లిపోతే సరిపోయేది.. అలా కాకుండా కారు ఓపెన్ టాప్ లోనుండే బయటకి చూస్తూ ఏదో సాధించినవాడిలా అభిమానుల అందరికీ అభివాదం చేస్తూ ఉండడంతో అత్యధిక సంఖ్యలో జనాలు తనని చూసే క్రమంలో తొక్కిసలాట జరిగి ఓ తల్లి కన్నబిడ్డను పట్టుకుని చనిపోయింది.. అంటూ మండిపడ్డారు.
మరోవైపు ఆసుపత్రిలో మరణించిన రేవతి కొడుకు చావు బతుకుల్లో ఉండగా సినీ ప్రముఖులంతా సిగ్గులేకుండా ఓ నటుడిని పరామర్శించడానికి క్యూలు కట్టారు. ఇదెక్కడి అన్యాయం... ఇక్కడ సాధారణ మనిషి అనేవాడి ప్రాణానికి విలువ ఉండదా? చావు బతుకుల్లో ఉన్న బాలుడ్ని పరామర్శించలేదు.. కానీ అల్లు అర్జున్ ని ఒక్కపూట జైలులో ఉంచడంతో ఏకంగా సెలెబ్రిటీలు ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్టు ఆయనని పరామర్శించడానికి బయలుదేరారు. ఆ హీరోకి కాలు పోయిందా.. కన్ను పోయిందా? దేనికి పరామర్శలు? ఆస్పత్రిలో ఉన్న బాలుడిని మాత్రం ఎందుకు పట్టించుకోరు? అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండో తేదీ సంధ్య థియేటర్ వాళ్లు దరఖాస్తు పెట్టుకోగా, చాలా స్పష్టంగా మూడో తేదీన లిఖిత పూర్వకంగా పోలీసులు తిరస్కరించారు.. అనుమతి లేకున్నా నాల్గో తేదీన అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. ఇప్పుడు చెప్పండి... అలాంటి వారిని అరెస్ట్ చేస్తే తప్పా అని ప్రశ్నించారు.