ఈ క్రమంలోనే సీపీఐ నేత నారాయణ కూడా సినిమాలు పెడదారి పడుతున్నాయి అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న పుష్ప 2 సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవతి మరణం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూనే దీనంతటికీ కారణం తెలంగాణ ప్రభుత్వమే అని విమర్శించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా వస్తే దానికి బెనిఫిట్ షోలు, టికెట్ ప్రజలు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది అన్నట్టు విమర్శనాస్త్రాలు విసిరారు.
నారాయణ ఒక వీడియో రిలీజ్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలో ఆయన సమాజానికి ఏమాత్రం ఉపయోగపడిన ఒక సినిమాకి తెలంగాణ ప్రభుత్వం మేలు చేయడం అనేది సిగ్గుచేటు అని అన్నారు. ఇందులో ఓన్లీ స్మగ్లింగే కాదు సమాజం చూడకూడని అసభ్యకరమైన పాటలు, చీపు డైలాగులు ఉన్నాయని ఓ రేంజ్ లో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఈ సినిమాని ప్రోత్సహించి పెద్ద తప్పు చేసిందన్నారు. పోలీసులపై ఈ తప్పును నెట్టడం సరికాదని కూడా చెప్పుకొచ్చారు. అల్లు కుటుంబ సభ్యులు ఇలాంటి చౌకబారు సినిమాలు తీయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ప్రేక్షకుల నడ్డి విరిచేలాగా చెత్త సినిమాల టికెట్లు రేట్లు పెంచడం మంచిది కాదని కూడా హితవు పలికారు. అమాయక ప్రజలు ఈ సినిమాలు చూసేందుకు వస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని, భవిష్యత్తులో అలా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కోరారు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఇలాంటి సంఘటనను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలి అని కూడా ఆయన పిలుపునిచ్చారు.