సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రేక్షకులు తమ స్పందనలను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. మహేష్ బాబు వాయిస్ "ప్యూర్ మ్యాజిక్"లా ఉందని, ముఫాసా పాత్రకు ఒక ప్రత్యేకమైన హుందాతనాన్ని తీసుకొచ్చారని ప్రశంసిస్తున్నారు. "ఈ ఏడాది 'గుంటూరు కారం', 'ముఫాసా' సినిమాలతో మహేష్ బాబు ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టారు" అంటూ ఒక అభిమాని కామెంట్ చేశాడు.
'ముఫాసా: ది లయన్ కింగ్'లో మహేష్ బాబు వాయిస్‌కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఉంటే ఇంకెలా ఉండేదో అని కొందరు, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఊహించుకుంటున్నారు. దీనికి కారణం, ఎన్టీఆర్ అభిమానులు క్రియేటివిటీకి హద్దుల్లేకుండా కొన్ని ఫ్యాన్ మేడ్ వీడియోలు తయారు చేయడమే. లయన్ కింగ్ పాత్రకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహిస్తూ వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా 'దేవర' సినిమాలో ఎన్టీఆర్ తన తండ్రి గురించి చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్‌ను 'ముఫాసా'లోని ఒక ముఖ్యమైన సీన్‌కు జత చేసి ఎడిట్ చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ సీన్‌లో, ఒక లయన్ కింగ్ కొండ అంచున కూర్చొని తన పిల్లతో తన తాత, తండ్రి గొప్పతనం గురించి చెబుతుంది. ఈ సీన్‌కు ఎన్టీఆర్ వాయిస్ యాడ్ చేయడంతో, ఆ వీడియో చూసిన వాళ్లంతా "ఎన్టీఆర్ వాయిస్ అదిరిపోయింది", "అతను వాయిస్ ఇచ్చుంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి" అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి, ఈ సీన్‌కు ఎన్టీఆర్ వాయిస్ పర్ఫెక్ట్‌గా సూట్ అయిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో 'ముఫాసా' సినిమాతో పాటు ఎన్టీఆర్ పేరు కూడా మారుమోగుతోంది. ఏది ఏమైనా, 'ముఫాసా' సినిమా మాత్రం అందరినీ అలరిస్తోంది.