ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడీగా నటించిన 'పుష్ప 2: ది రూల్' బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1,500 కోట్లకు పైగా కొల్లగొట్టి, భారతీయ సినిమా చరిత్రలో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే, ఈ సినిమా విజయం వెనుక కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, అల్లు అర్జున్, రష్మికల మధ్య చిత్రీకరించిన "పీలింగ్స్" పాటలోని హాట్ స్టెప్పులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఈ పాటను విమర్శించగా, మరికొందరు మాత్రం పాట బాగుందని సమర్థించారు.

ఈ వివాదంపై రష్మిక మందన్న గలాటా ప్లస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. "పీలింగ్స్" పాట కొరియోగ్రఫీ చూసి తాను మొదట షాక్ అయ్యానని ఆమె స్వయంగా ఒప్పుకుంది. "రిహార్సల్ వీడియో చూసినప్పుడు, 'ఇది ఏమిటి?' అనిపించింది. చాలాసార్లు నేను అల్లు అర్జున్ సర్ మీద డాన్స్ చేస్తున్నట్లు అనిపించింది," అని రష్మిక చెప్పడం విశేషం.

 ఈ పాట చిత్రీకరణ సమయంలో తనను పదే పదే ఎత్తుతున్న సన్నివేశాల్లో చాలా భయపడ్డానని రష్మిక వెల్లడించింది. "నన్ను ఎవరైనా లిఫ్ట్ చేస్తే చాలా భయమేస్తుంది. అయితే ఈ పాటలో అదే పనిగా నన్ను లిఫ్టింగ్ చేయాల్సి వచ్చింది. నిజంగా అది నాకు నరకంలా అనిపించింది" అని ఆమె తన ఇబ్బందిని వెల్లడించింది. అయితే, దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్‌పై ఉన్న నమ్మకంతో ఆ కష్టాన్ని భరించానని తెలిపింది. టీమ్ సపోర్ట్ వల్లే ఆ కష్టమైన సీన్స్ చేయగలిగానని చెప్పింది.

బోల్డ్ పాత్రల గురించి రష్మిక మాట్లాడుతూ.. నటిగా తాను కేవలం ప్రేక్షకులను అలరించడానికే పరిమితం కాకూడదని, దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా విభిన్న పాత్రలు పోషించాలని ఉందని చెప్పింది. "నేను ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకూడదు. అందుకే 'పీలింగ్స్' పాటలో ఛాలెంజింగ్ స్టెప్స్ చేయడానికి ఒప్పుకున్నాను. మిశ్రమ స్పందనలు వచ్చినా, కొత్త విషయాలు ప్రయత్నించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే" అని రష్మిక ధైర్యంగా చెప్పింది.

ఇక, సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విషాద ఘటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్లు అర్జున్, రష్మికలను చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో సంధ్యా థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె 9 ఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడటం అత్యంత బాధాకరం. ఈ దుర్ఘటన సినిమా వేడుక ఆనందాన్ని విషాదంలోకి నెట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: