అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అస్సలు సహించలేకపోయారు. అందుకే ఆయన మధ్యాహ్నం వ్యాఖ్యలు చేస్తే, ఈయన రాత్రి హడావుడిగా ఎనిమిదింటికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మిస్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఎలివేషన్స్ ఎవరూ నమ్మద్దని తన గురించి వచ్చేవి ఇవన్నీ కూడా పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇక ఈ వివాదం సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో, మళ్ళీ మొదలయ్యింది..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అల్లు అర్జున్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న రాత్రి ప్రెస్ మీట్ లో బన్నీ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించేలా ఉన్నాయని, వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, సినీ పరిశ్రమపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఎందుకు విజిట్ చేయలేదని సూటిగా ఇండస్ట్రీని ప్రశ్నించారు. ముఖ్యంగా, అల్లు అర్జున్ మామ, సినీ నటుడు చిరంజీవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను కనీసం పలకరించలేదని నిలదీశారు. సినిమా వాళ్లందరూ మానవత్వం లేకుండా ఇలాగే ఉంటారా అని తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో మరింత వివాదాస్పదంగా మారాయి.