ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‎ను అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వెంటనే బన్నీ హై కోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట లభించింది. ఈ కేసులో అల్లు అర్జున్‎కు హై కోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈ క్రమంలో సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్ కి మహిళ చనిపోయిందని తెలిసినప్పటికి ఆయన సరైన పద్దతిలో స్పందించలేదని నేడు సమాచారం వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా జూబ్లీహిల్స్‎లోని అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఆ దాడిని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తీవ్రంగా ఖండించారు. దాడి అనంతరం అరవింద్ మీడియాతో మాట్లాడారు. నేడు తన ఇంటి దగ్గర జరిగిన ఘటన అందరూ చూశారని అన్నారు. జరిగిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారని.. తన ఇంటి దగ్గర మళ్లీ ఎవరు గొడవ చేసినా వాళ్ళను తీసుకెళ్ళేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.  ఈసారి అరెస్ట్ తప్పదని తెలిపారు.
ఎవరు ఇలాంటి దుశ్చర్యలకు ప్రేరేపించకూడదని కోరారు. కాస్తా ఓపికగా ఉండాలని అభిమానులను రిక్వెస్ట్ చేశారు. ఈ అంశంపై సంయమనం పాటించాలని చెప్పుకొచ్చారు. దయచేసి అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అల్లు అరవింద్ కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: