తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా అల్లు అర్జున్ వివాదం మాటలే వినిపిస్తున్నాయి. అవును, ఈ క్రమంలోనే 'పుష్ప2' టాలీవుడ్ కొంప ముంచిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రీమియర్లో భాగంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించడం, ఆమె కొడుకు చావు బ్రతుకుల్లో హాస్పిటల్ లో కొట్టుమిట్టాడడంతో, అల్లు అర్జున్ అరెస్ట్ కావడం కూడా జరిగింది. కాగా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ తో పాటూ ఆయన్ని పరామర్శించిన సినీ ప్రముఖులందరిపై కూడా ఫైర్ కావడంతో ఈ విషయం మరింత వివాదం అయ్యింది. కాగా ఇక నుంచి సినిమాలకు సంబంధించి బెని ఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వమని రేవంత్ ప్రకటించడంతో టాలీవుడ్ కి షాక్ తగిలేటట్టు అయింది.

అయితే, రేవంత్ రెడ్డి ఫైర్ అయింది అల్లు అర్జున్ పై అయితే మంటలు అంటుకుంది మాత్రం నిర్మాత దిల్ రాజుకని సినిమా విశ్లేషకులు అంటున్నారు. నిజమే అనిపిస్తోంది... ఎందుకంటే? దిల్ రాజు నుంచి త్వరలోనే 3 సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నాయి. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన దిల్ రాజు సినిమాలకు ఊహించని ఎదురుదెబ్బగా మారింది. అన్నింటికి మించి దిల్ రాజు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ 'గేమ్ ఛేంజర్' జనవరి 10 న రిలీజ్ కాబోతోంది. రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఏకంగా రూ.250 కోట్లు పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

థియేట్రికల్ గా అయితే 500 కోట్లకు పైగా బిజినెస్ చేయడం గ్యారెంటీ. కానీ అంత భారీ మొత్తంలో రాబట్టాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ ఒక్క సినిమానే కాకుండా వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నిర్మాత కూడా దిల్ రోజునే. అదే విధంగా 'డాకు మహారాజ్' సినిమా విషయానికొస్తే... నైజాంలో దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాంతో ఈ 3 సినిమాలతో భారీ లాభాలు పొందాలనుకుంటున్న దిల్ రాజు ఆశలపై అల్లు అర్జున్ నీళ్లు చల్లినట్లయింది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తదుపరి కార్యాచరణ సినిమాల విషయంలో ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన మనసు మారితే ఒకేగానీ, సీఎం చెప్పినట్లు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వకపోతే దిల్ రాజుకి భారీ నష్టాలు తప్పవని చాలా క్లియర్ కట్ గా అర్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: