టాలీవుడ్ లో దేవర తో మ్యాన్ అఫ్ మాస్సెస్ గా గుర్తింపు తెచ్చుక్కున్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఇదిలావుండగా జూనియర్ ఎన్టీఆర్ పెద్ద మనసు చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమాని కౌశిక్ చికిత్సకు సాయం చేశారు. కౌశిక్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన చికిత్సకు, డిశ్చార్జికి అవసరమైన సహాయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అందజేశారు. తారక్ తరుఫున ఆయన టీమ్ కౌశిక్‌ను డిశ్చార్జి చేసేందుకు ఏర్పాట్లు చేయడంతో కౌశిక్ మంగళవారం ఆస్పత్రి  నుంచి డిశ్చార్జయ్యారు. దీంతో కౌశిక్ తల్లి సరస్వతమ్మ జూనియర్ ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.అయితే కౌశిక్ వైద్య చికిత్సకు సాయం చేస్తానన్న జూనియర్ ఎన్టీఆర్ నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదంటూ కౌశిక్ తల్లి సరస్వతి సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. కౌశిక్ డిశ్చార్జికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది. ఈ విషయాన్ని కౌశిక్ తల్లి సరస్వతి వెల్లడించారు. సోమవారం రాత్రి అపోలో ఆస్పత్రికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ టీమ్.. కౌశిక్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసింది. అనంతరం మంగళవారం ఉదయం కౌశిక్ డిశ్చార్జికి అవసరమైన రూ.12 లక్షలు చెల్లించినట్లు సరస్వతి తెలిపారు. దీంతో కౌశిక్‌ను డిశ్చార్జి చేశారని.. తాము ఇంటికి వెళ్తున్నామని చెప్పారు.కౌశిక్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందన్న సరస్వతి.. తమకు అండగా నిలిచిన ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. విలేకర్ల సమావేశంలో తానెక్కడా జూనియర్ ఎన్టీఆర్‌ గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు సరస్వతి. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చానన్నారు. తమ కుటుంబసభ్యులంతా ఎన్టీఆర్‌కు అభిమానులని చెప్పిన సరస్వతి.. తన కొడుకు చికిత్సకు సాయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. తన మాటల వలన ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బతిని ఉంటే తనను అర్థం చేసుకోవాలన్నారు. తానెక్కడా ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదని.. అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారని సరస్వతి చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: