పుష్ప 2 సినిమా విడుదల నేపథ్యంలో ఒక్కరోజు ముందు జరిగిన ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ ప్రముఖులు వరుసగా పరామర్శించడం జరుగుతోంది. ఈ క్రమంలో సినీ రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా ప్రజా సంఘాలకు చెందిన వారు కూడా శ్రీతేజ్‌ను పలకరిస్తూ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని హామీ ఇవ్వడం జరుగుతోంది. కాగా నిన్న దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్ ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ్‌ని పరామర్శించారు. ఆ సమయంలో మృతురాలు రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించడం తెలిసిందే. అందుకు సంబంధించిన చెక్‌ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ దిల్ రాజుకు అల్లు అరవింద్ అందించారు.
ఈ క్రమంలోనే శ్రీతేజ్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించడం జరిగింది. శ్రీ తేజ్ ని గమనించిన జానీ... శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగు పడుతుందని, అతడు త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మీడియా ముందు చెప్పుకొచ్చాడు. జానీ మాట్లాడుతూ... "బాబులో కదలికలు ఉన్నాయి. అతడు వినగలుగుతున్నాడు, చూస్తున్నాడు. త్వరలోనే శ్రీ తేజ్ అందరు పిల్లల మాదిరిగానే లేచి ఆడుకుంటాడు." అని చెప్పుకొచ్చాడు. పిల్లాడిని అలా చూడగానే సంతోషం కలిగిందని, వారి ఫ్యామిలీకి కొరియోగ్రాఫర్స్ యూనియన్ తరపున అండగా ఉంటామని ధైర్యం చెప్పినట్లుగా పేర్కొన్నారు.
అదే సమయంలో జానీ సదరు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.... జైలు నుండి బయటకి వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్యామిలీతోనే సమయం స్పెండ్ చేస్తున్నాను. కొన్ని పాటలకు కొరియోగ్రఫీ పెండింగ్ ఉంది. కనుక అల్లు అర్జున్‌ను కలిసే సమయం లేదని అన్నారు. అదే సమయంలో జానీ మాస్టర్ అరెస్ట్‌కి అల్లు అర్జున్ కారణం అనే పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. అని అడగగా... వాటికి సమాధానం చెప్పకుండానే జానీ... థాంక్యూ సో మచ్, జై హింద్ అంటూ అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఆ సమయంలో జానీ మాస్టర్ భార్య మాత్రం ఈ సమయంలో అలాంటి ప్రశ్నలు ఎంత వరకు కరెక్ట్? అంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.