ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ సినీ ఇండస్ట్రీలో పేను తుఫానుగా మారింది. ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‎ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ పై ప్రముఖ నిర్మాత ఒకరు విమర్శలు చేశారు. ఆయన మరెవరో కాదు తమ్మారెడ్డి భరద్వాజ.
ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. మహిళ మరణంతో తనకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా నైతిక బాధ్యత ఇప్పటికీ బన్నీపైనే ఉందని అన్నారు. థియేటర్ వద్ద బన్నీ నిర్వహించిన ర్యాలీ కారణంగానే తొక్కిసలాట జరిగిందని, రద్దీని నియంత్రించడంలో పోలీసులు, థియేటర్ యాజమాన్యం కూడా విఫలమయ్యాయని తమ్మారెడ్డి ఎత్తిచూపిన విషయం తెలిసిందే.
అయితే ఇటీవల ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డితో, సినీ పెద్దలు భేటీ అయ్యారు. దీంతో మరోసారి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పించారు. కేవలం ఒక్క మనిషి కోసం సినీ పెద్దలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అల్లు అర్జున్ పక్కన ఉన్నవారు సరైన సలహా ఇవ్వకపోవడం తొక్కిసలాటకు ఓ కారణమని చెప్పుకొచ్చారు. ఎలాంటి ప్రచారం లేకుండా సినిమాకు వెళ్తే ఇలా జరిగి ఉండకపోవచ్చని తెలిపారు. కొందరు హీరోలు సొంతగా నిర్ణయం తీసుకోలేకపోవడం సమస్యగా మారిందని చెప్పారు. కలెక్షన్లతో కాకుండా నటనతో గర్వకారణంగా మారాలని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: