ఆ మహిళ పేరు సాకే మౌనిక కాగా వరికుంటపాడు మండలం భోగ్యంవారిపల్లికి చెందిన ఈ మహిళ బేల్దారి పనుల నిమిత్తం భర్తతో కలిసి తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ సంపాదించుకున్న డబ్బుతో ఆమె సొంతింటిని నిర్మించుకున్నారు. ఇల్లు నిర్మించుకున్న తర్వాత విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని కనెక్షన్ కోసం తరచూ అధికారులను సంప్రదిస్తున్నా ఫలితం లేకుండా పోయింది.
ఉదయగిరి విద్యుత్ కార్యాలయం అధికారులను సంప్రదించడం కోసం ఆమె కూలి పనులు మానుకుని మరీ తిరగాల్సి వచ్చింది. అధికారుల తీరు ఆమెకు విసుగు, చిరాకు, కోపం తెప్పించింది. శనివారం రోజున ఆమె మరోసారి అధికారులను సంప్రదించే ప్రయత్నం చేయగా ఆఫీస్ కు ఎవరూ రాకపోవడంతో ఆమె బాధ వినేవాళ్లు కరువయ్యారు. ఏం చేయాలో పాలుపోని మౌనిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన వెంటనే స్పందించారు.
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తన వ్యక్తిగత సిబ్బందిని పురమాయించి ఏడీఈ కోటేశ్వరరావుకు ఫోన్ చేశారు. ఏడీఈ కోటేశ్వరరావు మౌనికను సంప్రదించగా ఆయన రెండు రోజుల్లో మీటర్ బిగిస్తానని హామీ ఇవ్వడంతో మౌనిక సంతోషించారు. మౌనిక ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేయడం గమనార్హం. ఎమ్మెల్యే చొరవ చూపి సమస్యను పరిష్కరించడాన్ని నెటిజన్లు సైతం మెచ్చుకుంటున్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను ఎంత ప్రశంసించినా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువమంది ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.