డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 చిత్రానికి సంబంధించి బెనిఫిట్ షో సంధ్య థియేటర్లో వేయగా ఆ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ చాలా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ పైన కేసు నమోదు అవ్వడంతో పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో కూడా హాజరు పరిచారు. దీంతో అల్లు అర్జున్ కు 14 రోజులు జుడీషియల్ రిమాండ్ ను కూడా విధించడం జరిగింది.
దీనిపై అల్లు అర్జున్ న్యాయవాదులు వెంటనే హైకోర్టును సైతం ఆశ్రయించగా అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చారు.నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ గడువు డిసెంబర్ 27 ని ముగిసింది. దీంతో వర్చువల్ గా నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరయ్యారట. హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని వెల్లడిస్తూ నాంపల్లి కోర్టుకు తెలియజేస్తూ అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. బెయిల్ ఇస్తారా లేదా అనే విషయంపై అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అలాగే సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసు విచారణ జనవరి 10వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. రేవతి కుటుంబానికి ఇప్పటికే రూ.2కోట్ల వరకు పుష్ప టీమ్ సహాయం అందించారు.